Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనువాద రాజ్యాంగమే బీజేపీ అజెండా
- దళిత, గిరిజనుల్ని శత్రువులుగా చూస్తున్నారు
- నవంబర్ 26న రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాలు: కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు జాన్‌వెస్లీ, స్కైలాబ్‌బాబు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మనువాదానికి అనుకూలంగా మార్చాలనే కుట్రలను తిప్పి కొట్టాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్ వెస్లీ, టీ స్కైలాబ్‌బాబు పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేవీపీఎస్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఆదేశాల ప్రకారం దేశంలో మనువాదాన్ని పెంచి పోషిస్తుందన్నారు. రాజ్యాంగంలో కులవ్యవస్థ నిర్ములన కోసం పొందుపర్చిన అంశాలను అమలు చేయడంలో తీవ్ర నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. దేశాన్ని మనువాదం వైపు నడిపిస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నారని చెప్పారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ దళిత,గిరిజనులను బద్ధ శత్రువులుగా చూస్తుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై విద్వేషాన్ని పెంచి, దాడులు,హత్యలు చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దళిత, బలహీన వర్గాలకు చేయూతగా ఉన్న జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పొడుస్తూ, బడ్జెట్లో నిధులు కోత పెట్టడం దుర్మార్గమని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను కలుపుకొని నవంబర్ 26న రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాణిక్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున,మీసాల కురుమయ్య, నందిపాటి మనోహర్, ఆరూరి కుమార్ బోడ సామెల్ తిప్పారపు సురేష్ కుమార్, జి రాజు, ఆర్ మహిపాల్ కోట గోపి దుడ్డేల రామ్మూర్తి, మంద సంపత్, పల్లెర్ల లలిత, రాష్ట్ర కమిటీ సభ్యులు అంతటి కాశన్న, ప్రకాష్ కరత్, ఎస్ రాజు, ఎన్ బాలపీరు, గుర్రం దేవేందర్ లక్ష్మీదేవి ,కావ్య శ్రీ, బాపట్ల లలిత, టి ప్రదేశ్ తదితరులు పాల్గొన్నారు.