Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థుల చర్చలు విఫలం
- విద్యార్థుల డిమాండ్‌కు ఆగ్రహం వ్యక్తం చేసిన నవీన్ మిట్టల్
- ఉద్యమాలు చేపడితే క్రిమినల్ కేసులు తప్పవన్న ప్రభుత్వం
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
నిజాం కళాశాల హాస్టల్ విషయంలో విద్యార్థులకు, రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌తో గురువారం రెండు విడతలుగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దాంతో విద్యార్థులు శుక్రవారం నుంచి తిరిగి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కళాశాల పూర్వ విద్యార్థి, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కళాశాల జూబ్లీ వేడుకల్లో పాల్గొని విద్యార్థినీల కోసం హాస్టల్ నిర్మిస్తామని ఇచ్చిన హామీ మేరకు కళాశాల ప్రాంగణంలో నూతనంగా హాస్టల్ భవనం నిర్మించింది. అయితే ఆ హాస్టల్లో పీజీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ఆదేశాలు జారీ చేశారు. దాంతో వారం రోజులుగా డిగ్రీ విద్యార్థులు తమకే హాస్టల్ వసతి సౌకర్యం కల్పించాలని కళాశాలలో ఆందోళనలు చేస్తున్నారు. ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆయన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌తో 10 మంది విద్యార్థినులు గంటపాటు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో హాస్టల్లో 50 శాతం పీజీ, 50 శాతం డిగ్రీ విద్యార్థినులకు ప్రవేశం కల్పిస్తామని కమిషనర్ తెలిపారు. దాంతో విద్యార్థులు తాము మిగిలిన విద్యార్థులతో చర్చించి తిరిగి చర్చలకు వస్తామని ప్రకటిం చారు. సాయంత్రం 4 గంటలకు మళ్లీ చర్చలు జరగగా నలుగురు విద్యార్థులే హాజరయ్యారు. హాస్టల్ మొత్తం డిగ్రీ విద్యార్థులకు ప్రవేశం కల్పించాలని కోరారు. దాంతో నవీన్ మిట్టల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మీరు ఉద్యమాలు ఎలా చేస్తారని, ఉద్యమాలు చేపడితే మీపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. అలాగే పదేండ్లు గడిచినా మీకు హాస్టల్లో వసతి లభించదని ఆయన హెచ్చరిం చారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో డిగ్రీ విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించేంత వరకు తాము ఉద్యమాన్ని కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.