Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం, ఉద్యోగుల, రైతుల సహకారంతో ముందుకు..
- డెయిరీ నూతన చైర్మెన్ సోమ భరత్ కుమార్
- మంత్రుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
నవతెలంగాణ- ఓయూ
సీఎం కేసీఆర్, పాడి రైతుల, ఉద్యోగుల సహకారాన్ని తీసుకొని రానున్న రోజుల్లో విజయ డెయిరీ ఉన్నతికి పాటుపడుతానని రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య లిమిటెడ్ (టీఎస్‌డీడీసీఎఫ్) నూతన చైర్మెన్ సోమ భరత్ కుమార్ అన్నారు. హైదరాబాద్ లాలాపెట్లోని విజయ డెయిరీ ఆవరణలో గురువారం నూతన చైర్మెన్‌గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. నూతన చైర్మెన్‌కు వారు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పుష్కలంగా తాగునీరు ఉండటంతో పశుగ్రాసానికి కొరత లేదని, దీంతోపాటు పశువులు ఆరోగ్యకరంగా పెరిగే వాతావరణం ఉందన్నారు. కావాల్సిన పాలు మనమే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తామన్నారు. సీఎం సహకారం, ఉద్యోగుల, రైతుల సహకారంతో ముందుకు వెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్, బండ ప్రకష్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలతరెడ్డి, శోభన్ రెడ్డి, కమిషనర్ ఆధార సింహ, అధికారులు జియం కమేష్, మల్లికార్జున్, మల్లయ్య, అరుణ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.