Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చదివే అలవాటును చిన్నప్పటినుంచే పెంచాలి : మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
- నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ పిల్లల పుస్తక ప్రదర్శన ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచంలో పుస్తకాల ఆవశ్యకత ఎంతో ఉందనీ, వాటితోనే విజ్ఞానం వస్తుందని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే చదివే అలవాటును పెంపొందించాలని సూచించారు. బాలల దినోత్సవం, గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'పిల్లల పుస్తక ప్రదర్శన'ను గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ పుట్టిన పిల్లల నుంచి పెద్దల వరకు మొబైల్, కంప్యూటర్ వినియోగం పెరిగిపోయిందని చెప్పారు. పుస్తక పఠనం తగ్గిపోయిందన్నారు. ఈ తరుణంలో సైన్స్, విజ్ఞానం, దేశభక్తి, చరిత్ర, ఇతర సాహిత్యానికి సంబంధించిన ఎన్నో విలువైన పుస్తకాలను నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ప్రచురించి విక్రయిస్తున్నదని అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా పుస్తక ప్రదర్శనను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. మంచి పుస్తకాలను చదివి గొప్ప మేధస్సును పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ పిల్లల్లో మూఢనమ్మకాలను పెంపొందించేలా బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాఠ్యపుస్తకాలను మారుస్తున్నాయని విమర్శించారు. స్వాతంత్య్ర పోరాటంతోపాటు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడంటూ ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. సర్దార్ వల్లభారు పటేల్‌ను సైతం వాడుకుంటున్నాయని అన్నారు. ఇలాంటి విష ప్రచారాలను తిప్పికొట్టే పుస్తకాలున్నాయనీ, వాటిని చదవడం ద్వారా వాస్తవ చరిత్రను ఈనాటి తరం తెలుసుకోవాలని సూచించారు. పుస్తకాలను చదివి శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు. నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ జనరల్ మేనేజర్ ఆర్ వాసు మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో పిల్లలకు ఉపయోగపడే కథలు, డ్రాయింగ్ పుస్తకాలున్నాయని వివరించారు. ఇంగ్లీష్, తెలుగు పుస్తకాలపై 20 శాతం వరకు రాయితీ ఉందన్నారు. పుస్తక ప్రదర్శన ఈనెలాఖరు వరకు కొనసాగుతుందని చెప్పారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠకులతోపాటు పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్, బాధ్యులు జి బుచ్చిరెడ్డి, నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఎడిటర్ కె ఆనందాచారి, మేనేజర్ డి కిష్టారెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం శ్రీనివాస్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్, పబ్లిషింగ్ హౌస్ సిబ్బంది ధనలక్ష్మి, రఘు, సుభాషిణి, సిద్దు, సుధాకర్, అరుణ్‌తోపాటు ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు గుత్తా సుఖేందర్‌రెడ్డి బుకహేౌస్లోని వివిధ పుస్తకాలను ఆసక్తిగా తిలకించారు. చాచా నెహ్రూ జీవితానికి సంబంధించిన పుస్తకాలను పిల్లలకు అందించారు. నేతాజీ సుభాష్‌చంద్రబోస్ జీవిత చరిత్ర పుస్తకాన్ని సుఖేందర్‌రెడ్డికి వాసు అందజేశారు.