Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో నల్లజెండాలతో ప్రదర్శనలు
- కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వద్ద ధర్నాలు
- కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ప్రకటన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో శనివారం మోడీ పర్యటన సందర్భంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు ప్రకటించాయి. గురువారం ఈ మేరకు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షులు జి.రాంబాబు యాదవ్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్బోస్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజరుకుమార్ యాదవ్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రెబ్బా రామారావు, ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, టీఎన్టీయూసీ అధ్యక్షులు ఎంకే బోస్, ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, ఏఐయూటీయూసీ రాష్ట్ర నాయకులు బాబూరావు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేషనల్ మానిటైజేషన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. సింగరేణి యాజమాన్యం కొత్తగా 15 బావుల్లో బొగ్గు వెలికితీతకు కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి అడిగితే ఇవ్వట్లేదనీ, కానీ, అదే సమయంలో బొగ్గుబావులను ప్రయివేటు సంస్థలకు అమ్మకానికి పెట్టిందని తెలిపారు. ఎన్టీపీసీలో ప్రయివేటీకరణ చర్యలకు పూనుకుంటున్నదని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మికులు తమ హక్కులను కోల్పోయే పరిస్థితి దేశంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, కోట్లాది మంది ప్రజలపై తీవ్ర భారాలు మోపుతున్నదని విమర్శించారు. విద్యుత్ చట్టసవరణ బిల్లు-2022ను 13 రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నా కార్పొరేట్ సంస్థల లాభాల కోసమే మోడీ సర్కారు మొగ్గుచూపుతున్న తీరును వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగానే మోడీ గో బ్యాక్ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఆర్ఎఫ్సిఎల్ వద్ద, సింగరేణి మైన్స్ సంబంధిత జిల్లాలైన ఖమ్మం, కొత్తగూడెం, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో నల్ల జెండాలతో భారీ నిరసనలు తెలపాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల వద్ద ధర్నాలు చేయాలని కోరారు. నిరసన కార్యక్రమాలన్నింటిలోనూ ఉద్యోగులు, కార్మికులు వేలాది పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం మోడీ గోబ్యాక్ నిరసనల్లో పాల్గొంటాం
హైదరాబాద్ సెంట్రల్ పబ్లిక్ కో-ఆర్డినేషన్ కమిటీ
ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం శనివారం కేంద్ర, కార్మిక సంఘాలు తలపెట్టిన మోడీ గోబ్యాక్ నిరసనల్లో పాల్గొనబోతున్నట్టు హైదరాబాద్ సెంట్రల్ పబ్లిక్ కో-ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ జె.రాఘవరావు, బీఈఎల్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సౌందర్ రాజ్, నిరంజన్, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కాంట్రాక్టు వర్కర్స్ ఫెడరేషన్ కన్వీనర్ బి.మధు, బీడీఈయూ గౌరవాధ్యక్షులు జె.వెంకటేశ్ ప్రకటించారు. గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వారు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎన్టీపీసీలో 30 శాతం వాటా విక్రయించేందుకు మోడీ సర్కారు పూనుకున్నదని విమర్శించారు. మైన్స్ యాక్టు రద్దు దారుణమన్నారు. మోడీ ప్రభుత్వం ఓవైపు కార్మికోడ్లను తీసుకొచ్చి, మరోవైపు ధరాభారాలు మోపుతూ కార్మికులను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం కార్మికులకు, ఉద్యోగులకు చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూనే ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నామని తెలిపారు.