Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయపరమైన చిక్కులు రాకూడదనే..
- ఉమ్మడి నియామక బోర్డు ద్వారానే నియామకాలు జరగాలి : గవర్నర్ తమిళిసై
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎట్లకేలకు గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చారు. విశ్వవిద్యాలయాల్లో ఉమ్మడి నియామక బోర్డుకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య తీవ్రస్థాయిలో విబేధాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై మంత్రితో ఆమె చర్చించారు. గురువారం సాయంత్రం సబితా ఇంద్రారెడ్డి రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్లారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్.లింబాద్రి... మంత్రి వెంట ఉన్నారు. 45 నిమిషాలపాటు గవర్నర్, మంత్రి పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ... విశ్వవిద్యాలయాల్లో ఉమ్మడి నియామక బోర్డు ద్వారా నియామకాలు త్వరగా జరగాలనేదే తన అభిమతమని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు రాకూడదనేదే తన విధానమని వెల్లడించారు. ఉమ్మడి నియామక బోర్డుపై గవర్నర్‌కు నెలకొన్న సందేహాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివృత్తి చేశారు. యూజీసీ నిబంధనల అమలు, న్యాయపరమైన రిజర్వేషన్ల అంశాలను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. నిబంధనలన్నింటినీ పూర్తి స్థాయిలో పాటిస్తున్నామనీ, ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని తెలిపారు. ప్రస్తుత విధానంలోని ఇబ్బందుల గురించి అధికారులు గవర్నర్‌కు వివరించారు. కొత్త విధానం అమలు ద్వారా కలిగే సౌలభ్యం గురించి కూడా వివరణిచ్చారు. ఈ మేరకు రాజ్‌భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.