Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలుగు రాష్ట్రాలకు పునర్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల శుక్రవారం విశాఖపట్నం, శనివారం రామగుండంలో పర్యటిస్తున్న సందర్భంగా ఆ ప్రాంతాల్లో ప్రజలు బంద్ పాటించాలనీ, నల్ల జెండాలు, నిరసనలతో గుణపాఠం చెప్పాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని మఖ్దూంభవన్లోని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ సమితి సభ్యులు పశ్యపద్మ, ఈ.టి.నర్సింహాలతో కలిసి ఏర్పాటు చేసిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ రామగుండానికి వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఏపీలో మోడీ పర్యటన సందర్భంగా విశాఖపట్నం బంద్ సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రధాని నిరసనలు, అవమాన పరిస్థితుల్లోను అడుగు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. తాము బ్రిటీష్ కాలం నాటి గవర్నర్, రాష్ట్రపతి వ్యవస్థను వ్యతిరేకిస్తున్నామనీ, నాడు బ్రిటీష్ తాబేదారులను గవర్నర్లుగా నియమించేవారని గుర్తు చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ది లేకుండా ఈ వ్యవస్థను అమలు చేసిందని మండిపడ్డారు. కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. కరోనా సమయంలో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన కేరళ ప్రభుత్వాన్ని భ్రష్ఠు పట్టిన గవర్నర్ అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థ వల్ల సంవత్సరానికి రూ.60 నుండి రూ.70 కోట్ల మేర ప్రభుత్వానికి ఖర్చవుతుందన్నారు. బీజేపీ ప్రతికూల రాష్ట్ర ప్రభుత్వాలను సీబీఐ, ఈడీ, గవర్నర్ వ్యవస్థ వల్ల ద్వారా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న దన్నారు.రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహారిస్తున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలనీ, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ రీకాల్ చేసి, ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి ఈ సందర్భంగా నారాయణ విజ్ఞప్తి చేశారు. రాజకీయ నిరుద్యోగ భృతి కింద ఆమెను బీజేపీ ప్రభుత్వం గవర్నర్ గా నియమించిందని విమర్శించారు. స్వయం ప్రతిపత్తి గల విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ హౌదాలో ఉన్న తమిళిసై ఉద్యోగ నియామకాలను ఆపడం ఏమిటని ప్రశ్నించారు. అక్కడ నియామకాలు, ఇతర అంశాలను పూర్తిగా వైస్ ఛాన్సలర్ చూసుకుంటారని గుర్తుచేశారు.
దక్షిణాదిపై బిజెపి దండయాత్ర
దక్షిణాది రాష్ట్రాలపైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దండయాత్ర చేపట్టిందని కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు. ఇందుకు ఈడి, సీబీఐ దాడులకు చేపట్టడంతో పాటు గవర్నర్ వ్యవస్థను కూడా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ప్రధాని పర్యాటన సందర్బంగా శనివారం సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 'రామగుండం బంద్' కార్యక్రమాన్ని విజయంతం చేయాలని కూనంనేని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ బంద్ కలిసొచ్చే పార్టీలతో ముందుకెళ్తామన్నారు.
బీజేపీని విమర్శిస్తే
నా ఫేస్ బుక్ అకౌంట్ రద్దు చేస్తారా?
తాను బీజేపీ విమర్శించే ప్రకటనలను సోషల్ మీడియా గ్యాలరీలో లేకుండా తొలగిస్తున్నారనీ, తన ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలను రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ, బీజేపీపై తన ప్రకటనలను ఎక్కువ మందికి షేర్ కాకుండా చూస్తున్నారని తెలిపారు. తాను ప్రజాస్వామ్య యుతంగానే మోడీపై విమర్శలు చేస్తున్నాననీ, తనపై క్రిమినల్ రికార్డ్ కూడా లేదని స్పష్టం చేశారు.