Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిలిచిన పాలమూరు రంగారెడ్డి పనులు
- మొదటి దశ పూర్తి కాలేదు..
- రెండో దశ ప్రారంభమే కాలేదు
- తరలిపోతున్న వాహనాలు, సిబ్బంది
- ఆరు నెలలుగా ఆగిపోయిన పనులు
- నిర్వహణ లేక కాల్వలకు నెర్రెలు
- రూ.1000 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే బీడు భూములన్నీ సిరులు కురిపిస్తాయి.. పచ్చని పొలాలతో పాలమూరు జిల్లా కళకళలాడుతుంది. కానీ.. నాగర్‌కర్నూల్, నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాలకు వరప్రసాయినిగా చెబుతున్న పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ప్రాజెక్టు మొదటి దశ పూర్తికాలేదు. రెండో దశ మొదలు కాలేదు. చేసిన పనులకు బిల్లులూ రాలేదు. భూసేకరణ.. పనులు జరగకపోవడం వల్ల కాంట్రాక్టర్లు వాహనాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కోర్టు చిక్కులు వీడితే తప్ప ప్రాజెక్టు పనులు ముందుకు జరిగేలా కనిపించడం లేదని అధికార వర్గాలు అంటున్నాయి. కేంద్రం కూడా మెలికలు పెట్టకుండా ఉండాల్సిన అవసరం ఉందంటున్నాయి.పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఒక 18 ప్యాకేజీలోనే 150 వాహనాలు, 300 మంది సిబ్బందిని ఇతర పనులకు తరలించారు. మొదటి దశలో నార్లాపూర్, ఏదుల వట్టెం, కరివేన, ఉద్దండపూర్, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లను పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటివరకు నార్లాపూర్, ఏదుల తప్ప మరేదీ పూర్తికాలేదు. సంపు పంప్‌హౌస్ పనులు సైతం నిలిచిపోయాయి. కరివేన గొట్టం, ఉద్దండపూర్ రిజర్వాయర్ల దగ్గర భూసేకరణ చేయకపోవడంతో పనులు నిలిపేశారు. గొట్టం రిజర్వాయర్ సమీపంలో 100 ఎకరాలకు సంబంధించి భూసేకరణ పరిహారం ఇవ్వకపోవడం వల్ల రైతులు పనులు జరగనివ్వడం లేదు. కుడికిల్ల, ఉద్దండపూర్, కరివేన రిజర్వాయర్ల పరిధిలో భూసేకరణ చేయకపోవడం వల్ల పనులు ముందుకు సాగడం లేదు. చేసిన పనులకు వెయ్యి కోట్లకు పైగా బిల్లులు రావాల్సి ఉంది. దీంతో కాంట్రాక్టర్లు పనులు ఆపేసి ఇతర ప్రాంతాలకు తమ సిబ్బందిని, వాహనాలను తరలిస్తున్నారు. మొదటి దశలో 18 ప్యాకేజీలలో జరుగుతున్న పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కాల్వ టన్నెల్ పంప్‌హౌస్ రిజర్వాయర్లు, పవర్ మోటార్లు పనులు సాగడం లేదు. ఇక రెండో దశలో చేపట్టాల్సిన పనుల ఊసే లేదు. రెండో దశలో నారాయణపేటలో కోస్గి, మద్దూరు, నారాయణపేట, ధన్వాడ దామరగిద్ద, మరికల్, ఊట్కూరు పరిధిలో ప్రధాన కాలువలు తీయాల్సి ఉంది. మహబూబ్‌నగర్‌లో, హన్వాడ, జడ్చర్ల, రాజాపూర్, బాలానగర్, మిడ్జిల్, నవాపేట, అడ్డాకుల, దేవరకద్రమండల పరిధిలో కాల్వలు తీయాల్సింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో వంగూరు, బిజినపల్లి, తిమ్మాజీపేట, తాడూరు, ఊరుకొండ, కల్వకుర్తి, వెల్దండ మండలాల పరిధిలో కాల్వ తీస్తే తప్ప సాగునీరు ఇచ్చే అవకాశం లేదు. మూడు జిల్లాల పరిధిలో 13 ప్రధాన కాలువలు 915 కిలోమీటర్లు తీయాల్సి ఉంది. డిస్ట్రిబ్యూటర్లను సైతం ఏర్పాటు చేయాల్సి ఉంది. రెండో దశ పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వేలు చేపట్టింది. కాలుష్య నియంత్రణ మండలి అనుమతులను కోరింది. ఇప్పటివరకు కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఎటువంటి అనుమతులూ రాలేదు.
ప్రాజెక్టు పూర్తయితే
పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి, నల్లగొండ, వికారాబాద్ జిల్లాలకు సాగునీరు, హైదరాబాదుకు తాగునీరు పుష్కలంగా అందుతుంది. ఆరు ప్రధాన రిజర్వాయర్ల ద్వారా 67.95 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ఇంకా అనేక రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకోవాలి. నిర్వాసితులకు భూమికి పరిహారం, ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని హామీలు ఇచ్చారు. నిర్వాసితులకు హామీలు అమలు చేస్తేనే పనులు ముందుకు సాగే అవకాశాలున్నాయి. 12వ ప్యాకేజీలో రూ.430 కోట్లతో పనులు ప్రారంభించారు. బిల్లులు రాక పనులు జరగకపోవడంతో అక్కడ ఉన్న 50 వాహనాలను, 300 మంది సిబ్బందిని ఇప్పటికే వివిధ ప్రాంతాలకు తరలించారు.
పనులు ఎలా చేయాలి..
కాంట్రాక్టర్ రమేష్
మేము రూ.430 కోట్లతో ఇక్కడ పనులు నిర్వహిస్తున్నాం. వివిధ కారణాల చేత ఆరు నెలలుగా పనులు ఆగిపోయాయి. ఒకవైపు రైతులు పరిహారం ఇవ్వలేదని పనులు నిలిపేస్తున్నారు. మరోవైపు పనులు నిలిపేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ చెబుతోంది. ఇటు రైతులు, అటు కోర్టుల మధ్య చిక్కుకునిపోయాం. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు సైతం సకాలంలో రావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పనులు ఎలా నిర్వహించాలి.