Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక ఖాతాలు తీసినా ప్రయోజనం సున్నా..
- నేరుగా జీపీలకు డబ్బులిస్తామన్న ప్రధాని మోడీ
- 8 నెలలుగా గ్రాంట్ విడుదల చేయని కేంద్రం
- జీపీల్లో ఖజానా ఖాళీ.. జీతాలకు తిప్పలు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
గ్రామ పంచాయతీలకు నేరుగా సెంట్రల్ గ్రాంట్స్ విడుదల చేస్తామని, కేంద్ర ప్రభుత్వం సర్పంచ్‌లను ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తీసి పంపిస్తే.. నేరుగా మీ ఖాతాల్లో గ్రాంట్‌ను విడుదల చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. అయితే, ఎనిమిది నెలలు గడుస్తున్నా కేంద్రం గ్రామ పంచాయతీలకు ఒక్క పైసా విడుదల చేసిన పాపాన పోలేదు. నిధుల్లేక పంచాయతీల ఖజానా ఖాళీ అయి జీతభత్యాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తాయి. కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు కేటాయించే నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాతాల్లో జమ చేసేది. ఆ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల ఖాతాల్లోకి విడుదల చేసేది. ఇలా చేయడం ఎప్పటి నుంచో జరుగుతోంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉన్నంత కాలం నిధుల కేటాయింపు ఇలానే కొనసాగింది. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు రావడంతో నిధుల విషయంలో ఆంక్షలు పెట్టడం మొదలు పెట్టింది. దాంతో కేంద్రం ఇచ్చే నిధుల్ని రాష్ట్ర ఖజానాకు కాకుండా నేరుగా గ్రామ పంచాయతీలకే కేటాయిస్తామని ప్రధాని చెప్పి.. ఇప్పుడు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సర్పంచ్‌లు అంటున్నారు.
పంచాయతీలకు సెంట్రల్ గ్రాంట్స్
కేంద్ర ప్రభుత్వం ఆయా గ్రామ పంచాయతీల జనాభా ఆధారంగా నిధుల్ని కేటాయిస్తుంది. ఆ నిధులతో గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, నీటి సంరక్షణ, ఓడీఎఫ్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కేంద్రం ఇచ్చే నిధుల్లో 60 శాతం తాగునీరు, పారిశుధ్యం, ఓడీఎఫ్, 40 శాతం నిధుల్ని పంచాయతీ వర్కర్లు, ఉద్యోగుల జీతభత్యాల కోసం పంచాయతీ అభీష్టం మేరకు వినియోగించుకోవచ్చు. ఆయా నిధులను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లో జమ చేస్తే.. వాటిని పది రోజుల్లోగా పంచాయతీల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసేది. కానీ, కేంద్రం నుంచి వచ్చిన నిధులను రాష్ట్రప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని కేంద్రం అనుమానం వ్యక్తం చేసింది. దాంతో పది రోజుల్లోపు పంచాయతీలకు నిధులివ్వకపోతే వడ్డీతో సహా చెల్లించాలని గతంలో సూచించింది. 2022-23 నుంచి రాష్ట్ర ఖాతాల్లోకి కాకుండా నేరుగా పంచాయతీలకే నిధులిస్తామని మోడీ ప్రకటించారు. ఇంత వరకు ప్రధాని ఇచ్చిన మాట ఆచరణకు నోచుకోలేదు.
8 నెలలుగా నిధుల్లేవు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో నిధుల్లేక గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాలు ఖాళీగా ఉన్నాయి. పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను ఎనిమిది నెలలుగా నిలిపివేసింది. పంచాయతీల జనాభాను బట్టి ఒక్కొక్కరికి రూ.166 చొప్పున కేంద్ర ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాల్సి ఉండగా ప్రస్తుతం రూ.115 మాత్రమే అందిస్తోంది. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ నిధులుగా ప్రచారం చేసుకుంటున్నందున రాష్ట్రంతో సంబంధం లేకుండా నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. సర్పంచులు ప్రత్యేక ఖాతాలు తెరిచాక కూడా పైసా విడుదల చేయలేదు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధుల్ని ఏప్రిల్ నుంచి విడుదల చేయాలి. సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీల్లో 15.27 లక్షల జనాభా ఉన్నారు. వీటికి నెలకు రూ.17 కోట్ల మేరకు 8 నెలలకు రూ.వంద కోట్ల వరకు సెంట్రల్ గ్రాంట్స్ విడుదల కావాల్సి ఉంది. మెదక్ జిల్లాలో 6.60 లక్షల జనాభా ఉంది. 469 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రతి నెలా రూ.7.59 కోట్ల చొప్పున రూ.60 కోట్ల వరకు నిధులు కేంద్రం నుంచి రావాలి. సిద్దిపేట జిల్లాలో 10.12 లక్షల జనాభా ఉంది. జిల్లాలో 499 గ్రామ పంచాయతీలున్నాయి. కేంద్రం నుంచి నెలకు రూ.11 కోట్ల చొప్పున రూ.93 కోట్ల మేర నిధులు రావాల్సి ఉంది.
ఖజానా ఖాళీతో జీతాలివ్వలేని పరిస్థితి
కేంద్రం నిధులతో చేయాల్సిన పైపులైన్ల లీకేజీ, పారిశుధ్య పనులు, తాగునీటి పైపులు, బోర్లు, మోటార్ల నిర్వహణ, విద్యుత్ బిల్లుల చెల్లింపు వంటి పనులు చేయలేకపోతున్నారు. మరోపక్క పంచాయతీల్లో పని చేస్తున్న సిబ్బంది, వర్కర్లకు నెలనెలా ఇవ్వాల్సిన జీతభత్యాలు చెల్లించలేకపోతున్నారు. తాగునీటి అవసరాలు, పారిశుధ్యం పనులు చేసేందుకు సర్పంచ్‌లు ఉద్దెర పద్ధతిలో సరుకులు తెచ్చి పనికానిస్తారు. ఎనిమిది నెలలైనా నిధుల్లేక చెల్లింపులు చేయలేదు. దాంతో ఉద్దెర(అప్పు) ఇవ్వట్లేదని పలువురు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల పన్నుల రూపంలో వచ్చిన సాధారణ నిధుల్ని విద్యుత్ బిల్లులు, ట్రాక్టర్ల కిస్తీ చెల్లింపుల కోసం వినియోగించుకోవాలని పంచాయతీ అధికారులే కార్యదర్శులపై ఒత్తిడి చేస్తున్నారు. దీన్ని సర్పంచులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
నిధుల్లేక ఏం చేయలేకపోతున్నం
ఎనిమిది నెలలుగా సెంట్రల్ గ్రాంట్స్, నాలుగు నెలలుగా రాష్ట్ర నిధులు రావట్లేదు. గ్రామ పంచాయతీలకు నిధులు రాకపోవడంతో కనీసం వర్కర్లకు వేతనాలివ్వని పరిస్థితి. మంచినీటి సరఫరా, విద్యుత్, పారిశుధ్య నివారణ వంటి పనులు చేయించడం కష్టమవుతోంది. ప్రత్యేక ఖాతా తీయమంటే తీసి ఇచ్చినం. పైసా పడలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు నిధులివ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయి. మోడీవి మాటలు తప్ప చేతలుండవు.
- అంకని ప్రవీణ్‌కుమార్, తాళ్లపల్లి సర్పంచ్, సంగారెడ్డి జిల్లా
మోడీ పంచాయతీలకు నిధులివ్వండీ
మోడీ ఇచ్చిన మాట మేరకు గ్రామ పంచాయ తీలకు నిధులివ్వాలి. ప్రత్యేక బ్యాంకు ఖాతా తీసి ఇచ్చినం. ఇంత వరకు పైసలేయలేదు. గ్రామంలో చేయాల్సిన పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి పనులకు ఇబ్బంది అవుతోంది. కనీసం ట్రాక్టర్ల డీజిల్, వర్కర్ల జీతాలకు పైసల్లేని పరిస్థితి. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఎలాంటి నిధులివ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం పట్లనే కాకుండా గ్రామ పంచాయతీల పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపునకు పోతుంది. పంచాయతీలకు హక్కుగా రావాల్సిన నిధుల్ని ఇవ్వకుండా జాప్యం చేయడం సరికాదు. చట్ట ప్రకారం రావాల్సిన నిధుల్ని కేంద్రం విడుదల చేయకపోవడం రాజ్యాంగ విరుద్దమే అవుతుంది.
- జి.మల్లేశం, బూర్గుపల్ల్లి సర్పంచ్,మెదక్ జిల్లా
కేంద్రం మోసం చేస్తోంది
కేంద్ర ప్రభుత్వం పంచాయతీలను మోసం చేస్తోంది. ప్రధాని మోడీనే గ్రామ పంచాయతీలకు నిధుల్ని పంపిస్తామని ప్రటించారు. ఎనిమిది నెలలైనా డబ్బులివ్వకపోతే పంచాయతీల నిర్వహణ ఎలా సాగుద్ది. రాజ్యాంగం మీద గౌరవం ఉంటే వెంటనే స్థానిక సంస్థలకు హక్కుగా రావాల్సిన నిధుల్ని వెంటనే విడుదల చేయాలి. నిధుల్లేకపోవడం వల్ల గ్రామాల్లో ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితి. రాష్ట్రం నుంచి కూడా నిధులు రెగ్యులర్‌గా రావట్లేదు. కేంద్రం ఇవ్వాల్సిన సెంట్రల్ గ్రాంట్‌ను వెంటనే పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలి.
- ఆలేటి రజితయాదగిరి, వల్లంపట్ల సర్పంచ్, సిద్దిపేట జిల్లా