Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైన్స్ విద్యార్థులకు 'ప్రయివేటు' పరీక్ష వద్దు
- బోర్డు ప్రతిపాదనకు సర్కారు నిరాకరణ
- ఇంటర్మీడియెట్‌లో సంస్కరణలు అమలు
- ఎంపీసీ, ఎంఈసీకి వేర్వేరుగా మ్యాథ్స్ సిలబస్
- లాంగ్వేజ్ సబ్జెక్టులకు ఆన్లైన్ మూల్యాంకనం
- ఇంగ్లీష్‌కూ ప్రాక్టికల్ పరీక్షలు
- మిక్స్డ్ ఆక్యుపెన్సీ కాలేజీలకు గుర్తింపు ఇస్తాం: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి
- ఇంటర్ బోర్డు పాలకమండలి సమావేశంలో నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ విద్యలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలను అమలు చేస్తున్నది. అయితే అనుబంధ గుర్తింపు లేని కాలేజీల్లో చదివే సుమారు లక్ష మంది విద్యార్థులకు ప్రయివేటుగా పరీక్షలు రాయించాలన్న ఇంటర్ బోర్డు ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. ముఖ్యంగా సైన్స్ విద్యార్థులకు ప్రయివేటుగా పరీక్షలను రాయిస్తే పలు ఇబ్బందులు వస్తాయనీ, అందుకే వద్దని అభిప్రాయపడింది. ఇంకోవైపు 2018-19 విద్యాసంవత్సరంలో గ్లోబరీనా సాఫ్ట్వేర్ సంస్థ కారణంగా ఇంటర్ పరీక్షల ఫలితాల్లో అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తక్కువ మార్కులు వచ్చాయన్న కారణంతో మనస్తాపం చెంది సుమారు 27 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు ఫలితాల ప్రాసెసింగ్‌ను చేపట్టిన గ్లోబరీనా సంస్థకు ప్రభుత్వం ఇప్పుడు క్లీన్చిట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఇంటర్ బోర్డు పాలకమండలి సమావేశం హైదరాబాద్‌లోని రూసా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, ఆ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్, ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, జేఎన్టీయూహెచ్ వీసీలు డి రవీందర్, టి రమేష్, డి రవీందర్ గుప్తా, కట్టా నర్సింహ్మారెడ్డి హాజరయ్యారు. వారు 110 అంశాలపై చర్చించారు. వాటిలో మెజార్టీ అంశాలకు పాలక మండలి ఆమోదం తెలిపింది. ప్రయివేటుగా పరీక్షలు రాయించాలన్న ప్రతిపాదనను, ఇంటర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు పెంపును మాత్రం తిరస్కరించింది. నిబంధనలను ఉల్లంఘించిన ప్రయివేటు కాలేజీలపై భారీగా జరిమానా విధించాలని నిర్ణయించింది. అనుబంధ గుర్తింపు, తనిఖీ ఫీజును పెంచాలని ఆమోదించింది. ప్రయివేటు, ఎయిడెడ్ కాలేజీల్లో సిబ్బందితోపాటు విద్యార్థులకూ బయోమెటిక్ర్ అమలును తప్పనిసరి చేసింది. అయితే ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం సిబ్బందికే వర్తింపచేయడం గమనార్హం. ఇందుకు సంబంధించి బయోమెట్రిక్ మెషీన్లను కొనుగోలు చేసేందుకు రూ.61.56 లక్షలు అవసరమవుతాయని అంచనా వేసింది. సివిక్స్ను పొలిటికల్ సైన్స్‌గా చేసిన మార్పును ఆమోదించింది. 2023-24 విద్యాసంవత్సరంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, 2024-25 విద్యాసంవత్సరంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ భాష సబ్జెక్టు సిలబస్‌ను మారనుంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల మ్యాథ్స్ సిలబస్‌ను సాధారణీకరించేందుకు సబ్జెక్టు నిపుణులతో కమిటీ వేయాలని నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎంపీసీ, ఎంఈసీ కోర్సులకు వేర్వేరుగా మ్యాథ్స్ సిలబస్‌ను రూపొందిస్తారు. ఇంగ్లీష్‌కు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేకంగా కాలేజీల్లో ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. స్పోకెన్ ఇంగ్లీష్‌ను సైతం విద్యార్థులకు నేర్పించాలని నిర్ణయించింది. అయితే గుర్తింపు లేని కాలేజీల్లో చదివే సైన్స్ విద్యార్థులకు హాజరు నుంచి మినహాయింపునిచ్చి ప్రయివేటుగా రాయించాలన్న ప్రతిపాదనను కమిటీ తిరస్కరించింది. దశలవారీగా ఆన్లైన్లో మూల్యాంకనం చేపట్టాలని సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.
తొలుత లాంగ్వేజ్ సబ్జెక్టులకు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్లైన్లోనూ మూల్యాంకనం చేయాలని నిర్ణయించింది. వాటి ఫలితాన్ని బట్టి ఇతర సబ్జెక్టులకు వర్తింపచేయాలని భావించింది. ఇంటర్ బోర్డులో 52 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో నోడల్ అధికారుల కార్యాలయాల్లోనూ జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ తరగతులు, 70 సిలబస్‌తో పరీక్షల నిర్వహణను సైతం పాలకమండలి అంగీకరించింది.
కాలేజీలు తెరిచే నాటికే పుస్తకాలు సిద్ధం : సబిత
రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలు తెరిచే నాటికే విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఇంటర్ బోర్డు పాలకమండలి సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పేపర్ సకాలంలో అందని కారణంగా పాఠ్యపుస్తకాల ముద్రణ ఏటా ఆలస్యమవుతున్నదని అన్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అందుకే వచ్చే ఏడాదికి సంబంధించిన పాఠ్యపుస్తకాల ముద్రణను ఇప్పుడే ఇస్తామని అన్నారు. ప్రయివేటు కాలేజీల అనుబంధ గుర్తింపు విషయంలోనూ ఆలస్యమవుతున్నదని చెప్పారు. మే నాటికి గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉన్న కాలేజీలకు ఈ ఏడాది, వచ్చే విద్యాసంవత్సరంలోనూ గుర్తింపు ఇస్తామని వివరించారు. ఇందుకు సంబంధించి హోంమంత్రితో సంప్రదించామని చెప్పారు. ఆ తర్వాత కాలేజీ యాజమాన్యాలే శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించాలని సూచించారు.