Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలి
- ఇండ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు మంజూరు చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా కందుకూరు, నాగర్‌కర్నూల్ జిల్లా ఎత్తం గ్రామంలో గత ప్రభుత్వాలు పేదలకు ఇంటి పట్టాలిచ్చి స్థలాలను చూపలేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తెలిపింది. పట్టాలున్న నిరుపేదలు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుంటే వాటిని తొలగించడం అమానుషమని విమర్శించింది. గుడిసెలు వేసుకున్న వారిని అక్రమంగా అరెస్టులు చేసి, పోలీసు స్టేషన్లలో నిర్బంధించి కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించింది. ఆయా స్థలాల్లో ఇండ్లు కట్టుకోవడానికి ఒక్కో కుటుంబానికి రూ.ఐదు లక్షలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లాలో మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండల కేంద్రం సర్వేనెంబర్788లో 5.20 ఎకరాల్లో 183 మంది నిరుపేదలకు 60 గజాల చొప్పున 2007లో అప్పటి ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలకు పట్టాలిచ్చిందనీ, కానీ స్థలం చూపలేదని తెలిపారు. ఆ స్థలాన్ని కొంత మంది అక్రమంగా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దీంతో 450 మంది పట్టాలున్న వారితోపాటు, ఇండ్లు లేనివారు గుడిసెలు వేసుకుని అక్కడే నివసిస్తున్నారని పేర్కొన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండలం ఎత్తం గ్రామంలోని సర్వేనెంబర్ 289, 334లో 11.33 ఎకరాల్లో 1996లో 201 మందికి ప్రభుత్వం పట్టాలిచ్చి, స్థలం చూపలేదని వివరించారు. ఆ స్థలంలో రైతువేదిక, కరెంట్ జంక్షన్, నర్సరీని 1.20 ఎకరాల్లో ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. మిగిలిన స్థలంలో పట్టాలున్నవారే గుడిసెలేసుకున్నారని పేర్కొన్నారు. ఆ రెండు కేంద్రాల పేదలు అనేక ఉద్యమాలను చేయడంతోపాటు, పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం రాలేదని విమర్శించారు. దీంతో ఆయా స్థలాల్లో గుడిసెలు వేసుకున్నారని గుర్తు చేశారు. ఆ గుడిసెలను గురువారం తెల్లవారు జామున వందలాది మంది పోలీసులు జేసీబీలతో తొలగించారని తెలిపారు. మహిళలపై దాడులు చేశారని విమర్శించారు. కందుకూరులో సీపీఐ(ఎం) నాయకులను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఎత్తం గ్రామంలో సీపీఐ(ఎం) నాయకులు బి శ్రీనివాస్, ఎంపీటీసీ శ్రీనివాసరావుతోపాటు మరోఇద్దరిపై అక్రమంగా 307 కేసు నమోదు చేశారని వివరించారు.
ఎంపీటీసీని జైలుకు పంపారని తెలిపారు. అదే విధంగా పోలీసులను అడ్డుకున్నారనే కారణంతో గ్రామ సర్పంచ్ వరలక్ష్మితోసహా, నాయకులపైనా, గుడిసెవాసులపైనా అక్రమంగా కేసులు పెట్టారని పేర్కొన్నారు. రెండు కేంద్రాల్లో పోలీస్ పికెట్ పెట్టి ఆ స్థలాల్లోకి పేదలు వెళ్లకుండా అడ్డుకుంటూ భయప్రభాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను రియల్ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి భూదందాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. కానీ పేదలు తలదాచుకోవడానికి 60 గజాల్లో గుడిసెలు వేసుకుంటే వందలాది మంది పోలీసులతో దాడులు చేయడం సరైందికాదని పేర్కొన్నారు. తక్షణమే వారికి న్యాయం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ్మినేని డిమాండ్ చేశారు.