Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లుగీత కార్మిక సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి గ్రామంలో 80 గౌడ కుటుంబాలను బహిష్కరించిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం(కేజీకేఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యం.వి. రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీకి రూ.5 లక్షల 20వేలు ఇవ్వాలంటూ గీత కార్మికులను డిమాండ్ చేశారనీ, తాము అంత ఇవ్వలేమని చెప్పటంతో వారిని గ్రామం నుంచి బహిష్కరించరని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లాలో వీడీసీల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయనీ, వారు చెప్పినట్టు వినకపోతే బహిష్కరిస్తున్నారని పేర్కొన్నారు. వీడీసీల వ్యవస్థని రద్దు చేయాలంటూ గతంలో అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ వారిపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు.ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని తెలిపారు.ఇప్పటికైనా వీడీసీ వ్యవస్థని పూర్తిగా నిర్మూలించాలని డిమాండ్ చేశారు.