Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉండటం సరిగాదు : కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఆట మొదలైందనీ, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై అడుగడుగునా నిలదీస్తూ తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండటం సరిగాదని అభిప్రాయపడ్డారు. రాజకీయాలను, అభివృద్ధి కార్యక్రమాలను వేరువేరుగా చూడాలని హితవుపలికారు. శుక్రవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త టెక్నాలజీతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి జాతికి ప్రధాని మోడీ అంకితం చేయబోతున్నామని తెలిపారు. అదే వేదిక నుంచి జాతీయ రహదార్లు, రైల్వే లైన్ ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రంలో చేసిన పనులకు బిల్లులు అందక కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తున్నారనీ, లబ్దిదారులకు ఏ ఒక్కటీ సకాలంలో అందట్లేదని అన్నారు. కనీసం మహిళ అని చూడకుండా గవర్నర్ తో కవ్వింపు చర్యలకు పాల్పడటం, ప్రోటోకాల్ పాటించకపోవడం దారుణమని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులకు, శంకుస్థాపనకు ప్రధాని రావొద్దని ఫ్లెక్సీలు పెట్టడం దుర్మార్గమన్నారు. కేంద్రం నిధులు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్మించారా? మహారాష్ట్ర సీఎం సహకారం లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద కొట్లాడుతామన్నారు. కల్వకుంట్ల కుటుంబం స్పాన్సర్ చేసి ప్రకటనలు ఇప్పించి ఫ్లెక్సీలు కడుతున్నారని విమర్శించారు. వామపక్షాలు, ప్రజా సంఘాలు కేసీఆర్ సీఎం అవ్వక ముందు ఎలా ఉండేవారు? ఇప్పుడెలా ఉన్నారు? అనే దానిపై ఆలోచన చేసుకోవాలన్నారు. ఉక్కు పాదం తో కేసీఆర్ ప్రజా సంఘాలు లేకుండా అణచి వేయలేదా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ చేత గానీ తనంతోనే మెడికల్ కాలేజీలు రాలేదన్నారు. ఇప్పటి వరకు గిరిజన మ్యూజియానికి భూమి ఇవ్వలేదని చెప్పారు. సిట్లు ప్రగతిభవన్లో సిట్ అయ్యాయని విమర్శించారు. దమ్ముంటే ఎమ్మెల్యేకు ఎర కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. ఈడీ, ఐటీ దాడులతో తమకు సంబంధం లేదన్నారు. వామపక్షాలు ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ పక్షాన చేరారో చెప్పాలనీ, మీ ప్రజా సంఘాలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.