Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2.03 కోట్ల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం
- రైతుబంధు ద్వారా తొమ్మిది విడతల్లో రూ.57,881 కోట్లు ఖాతాల్లో జమ
- సమాచార పౌర సంబంధాల శాఖ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల వల్ల రాష్ట్రంలో పంటల విస్తీర్ణం 2.03 కోట్ల ఎకరాలకు పెరిగింది. మరోవైపు పంటల ఉత్పత్తి 3.50 లక్షల టన్నులకు పెరిగింది. ప్రతిష్టాత్మక రైతు బంధు పథకం ద్వారా ఇప్పటి వరకూ తొమ్మిది విడతల్లో కలిపి రూ.57,881 కోట్లను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని సమాచార, పౌర సంబంధాల శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్నప్పటికీ ఉమ్మడి పాలనాకాలంలో నాటి ప్రభుత్వాలు చూపిన వివక్ష, నిర్లక్ష్యం వల్ల తెలంగాణ వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుందని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటుతో ఇప్పుడు ఆ రంగానికి నూతన జవసత్వాలు లభిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా రూపొందించి అమలు చేస్తున్న రైతుబంధు, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, రైతు బీమా, చెరువుల పునరుద్ధరణ, భారీ సాగునీటి ప్రాజెక్టులు, నాణ్యమైన విత్తనాలు సరఫరా,పంటలు కొనుగోలు, రైతువేదికలు, ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారి నియామకం తదితర కార్యక్రమాలు, పధకాలతో రైతుల్లో సేద్యం పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించామని ఆ ప్రకటనలో వివరించారు.