Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాలపై బెదిరింపు ధోరణి సరికాదు
- పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలి: ఎన్ఎంఓపీఎస్ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నదని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్ఎంఓపీఎస్) సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ విమర్శించారు. జాతీయ పెన్షన్ పథకంలో వ్యక్తిగత చందా దారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న సొమ్మును తిరిగి తీసుకు నేందుకు చట్టం అనుమతించడం లేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఉన్న ఆ సంఘం కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ఇవ్వబోమంటూ రాష్ట్రాలపై బెదిరింపు ధోరణి సరైంది కాదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ముపై కేంద్రం పెత్తనమేంటని ప్రశ్నించారు. అంతిమ యాజమాన్య హక్కు ఉద్యోగిదే అని అన్నారు. పీఎఫ్ఆర్డీఏ చట్టం ప్రకారం జాతీయ పెన్షన్ పథకంలో చేరడమనేది రాష్ట్రాలకు ఒక ఆప్షన్ మాత్రమేనని చెప్పారు. దాన్ని వద్దనుకున్నప్పుడు తిరిగి వెనక్కి వెళ్లొచ్చంటూ ఉందనీ, ఎలా వెళ్లాలో మాత్రం చట్టంలో చెప్పలేదని వివరించారు. అంతమాత్రాన రాష్ట్రాలు వెనక్కి వెళ్లే అవకాశం లేదంటూ ఆర్థిక మంత్రి చెప్పడం విడ్డురంగా ఉందని విమర్శించారు. ఇది పూర్తిగా గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగే ఎన్నికల్లో భాగంగానే ఆమె ఆడుతున్న వింత నాటకమని అన్నారు. ఇప్పటికే రాజస్థాన్ సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించిందని గుర్తు చేశారు. పెన్షన్ ఫండ్ ఇవ్వాలంటూ పీఎఫ్ ఆర్డీఏకు లేఖ రాసిందని వివరించారు. ఇప్పటివరకు రాతపూర్వకంగా ఎన్పీ ఎస్‌లో వ్యక్తులు దాచుకున్న డబ్బులు వెనక్కి రావంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పగలుగుతుందా?అని ప్రశ్నించారు. పీఎఫ్ఆర్డీఏ చట్టంలో పదేండ్లలో ఈ పెన్షన్ పథకం ఉద్యోగుల ఆర్థిక, సామాజిక భద్రతలో సఫలీకృతం కాకపోతే ఆ చట్టాన్ని రద్దు చేసు కోవచ్చన్న అంశం కూడా ఉందని గుర్తు చేశారు. ఇంతటి గ్యారంటీ లేని పెన్షన్ పథకాన్ని చట్టాన్ని 18 ఏండ్లయినా ఇంకా కొనసాగించ డమంటే ఉద్యో గులను మోసం చేస్తున్నట్లేనని విమర్శిం చారు. సామాజిక, ఆర్థిక భద్రత కల్పిం చాల్సిన ఈ చట్టం కేవలం కార్పొరేట్లకు కొమ్ము కాసే విధంగా ఉందని అన్నారు. అందుకే పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజస్థాన్, చత్తీస్ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దు చేశాయనీ, పాత పెన్షన్ పథకాన్ని ఉద్యోగులకు వర్తింపచేశాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లా యిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోనూ ఎన్పీఎస్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.20 వేల కోట్లను వెనక్కి తేవాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరేందర్‌రావు, నాయకులు కోటకొండ పవన్, సత్యనారాయణ, సమీనా కాటూన్ తదితరులు పాల్గొన్నారు.