Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ సంరక్షణ నియమాలు-2022 ను ఉపసంహరించాలి
- 15న నియమాల ప్రతుల దగ్దం : ఆదివాసీ, అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన హక్కుల్ని కాలరాస్తే ఉద్యమం తప్పదని ఆదివాసీ, అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అటవీ సంరక్షణ నియమాలు-2022ను ఉపసంహరించుకోవాల్సిందేనని డిమా ండ్ చేశారు. లేదంటే రైతాంగ ఉద్యమం తరహాలో గిరిజన సంరక్షణ ఉద్యమం చేపడతామని స్పష్టంచేశారు. ఆదివాసీ విప్లవ వీరుడు బీర్సా ముండా 147వ జయంతి సందర్భంగా ఈ నెల 15న కార్పొరేట్ అనుకూల 'అటవీ సంరక్షణ నియమాలు -2022' ప్రతుల దిష్టిబొమ్మలను దగ్దం చేయాలని వారు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివాసీ, అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ కన్వీనర్లు వేములపల్లి వెంకట్రామయ్య, అంజయ్య నాయక్, తెలంగాణ గిరిజన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్, ఇండియన్ నేషనలి స్టు మూమెంట్ అధ్యక్షులు డాక్టర్ కృష్ణ ప్రసాద్, సీపీఐ(ఎంఎల్) నాయకులు ప్రసాదన్న, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి మండల వెంకన్న విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రామయ్య మాట్లాడుతూ ఆదివాసీల మీద మోడీ ప్రభుత్వం అప్రకటిత యుద్ధం ప్రకటించిందని తెలిపారు. అనేక పోరాటాల ఫలితంగా రూపొందించిన అటవీ హక్కుల చట్టం-2006, పీసా చట్టం-1996, భూసేకరణ పునరావాస నష్టపరిహారం చట్టం-2013 తదితరాలను, వాటిలోని నియమాలను తుంగలో తొక్కి..'నూతన అటవీ సంరక్షణ నియమాలు-2022'ను మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నదని చెప్పారు. ఇది పూర్తిగా కార్పొరేట్ అనుకూల విధానమేనని తెలిపారు. కోట్లాది మందికి జీవనాధారంగా ఉన్న అడవులను కాపాడుకోవాలనీ, పర్యావరణ పరిరక్షణకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పోడు భూముల సమస్యను పరిష్కరించటంలోనూ, పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వటంలో కేసీఆర్ ప్రభుత్వంఅనుసరిస్తున్న నాన్చుడు ధోరణి తగదని సూచించారు. ఎన్నికలప్పుడు రకరకాల వాగ్దానాలు ఇస్తున్నారు తప్పితే..వాటిని అమలు చేయటం లేదని విమర్శించారు. శ్రీరాంనాయక్ మాట్లాడుతూ ఆదివాసుల జీవితాలను నాశనం చేసే 2022 అటవీ నియమాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.లేదంటే దేశ వాప్తంగా ఉద్యమాలు తప్పవన్నారు. రాష్ట్రంలో పోడు సాగుదారులపై దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు బనాయించటాన్ని నిలిపేయాలని డిమాండ్ చేశారు. అంజయ్యనాయక్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గిరిజన వ్యతిరేక విధానాలను మానుకోవాలన్నారు. లేదంటే రైతాంగ పోరాట స్ఫూర్తితో గిరిజన ఉద్యమాలు ఉద్యమాలు వస్తాయన్నారు.కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పర్యావరణం దెబ్బతింటే..మానవ మనుగడకే ముప్ఫు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ల ప్రయోజనాలకోసం అడవులను అంతం చేయొద్దని ప్రధాని మోడీకి సూచించారు.