Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడ్ శోభన్
నవతెలంగాణ-కాశిబుగ్గ
వ్యవసాయ మార్కెట్లలో వ్యాపారుల దోపిడీకి పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడు శోభన్ అన్నారు. శుక్రవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లోని పత్తియార్డును తెలంగాణ రైతు సంఘం ప్రతినిధులు సందర్శించి రైతులతో మాట్లాడి ధరల వివరాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వరంగల్ వ్యవసాయ మార్కెట్లో అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 75,400 క్వింటాళ్ల పత్తిని ప్రయివేటు వ్యాపారులు కొనుగోలు చేశారని తెలిపారు. అంతర్జాతీయంగా పత్తికి మంచి డిమాండ్ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను సాకుగా చూపుతూ ప్రయివేటు వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై క్వింటాకు రూ. 7వేల నుంచి రూ.8,600 లోపు ధర పెట్టి మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం పత్తికి క్వింటాకు కనీసం రూ.12000 మద్దతు ధర ఉండాలని డిమాండ్ చేశారు. 2017 సంవత్సరం జీవోను అనుసరించి రైతులకు ఒక్కో గన్నీ బ్యాగుకు రూ.60 చెల్లించాలని కోరారు. 2017 నుంచి ఇప్పటివరకు 1.50 వేల బ్యాగులకు సుమారుగా రూ.కోటి రైతులు నష్టపోయినట్టు తెలిపారు. మార్కెట్ నిబంధనల ప్రకారం కమిషన్ 2శాతం వసూళ్లు చేయాల్సి ఉండగా అదనంగా మరో 2శాతం వసూలు చేస్తూ రైతును నిలువు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. అనంతరం మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి బివి రాహుల్ ను కలిసి సమస్యలను వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పి. కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి ఈసంపెల్లి బాబు, జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల మురళి, సహాయ కార్యదర్శి చల్ల నర్సింహా రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఓదెలు, బషీర్, జన్ను సురేష్, తదితర్నులు పాల్గొన్నారు.