Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ
- మోడీ గోబ్యాక్ అంటూ ర్యాలీగా బయల్దేరిన నాయకులు
- అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతికి అంకితం చేసిన ఆస్తులను కార్పొరేట్లకు అమ్ముకుంటున్న ప్రధాని మోడీకి దేశాన్ని పాలించే హక్కు లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. నోట్లరద్దు పేరుతో ఆయన కొంతమంది వ్యాపార స్నేహితులకు ప్రయోజనం చేకూర్చారని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చకుండా రాష్ట్రంలోకి అడుగుపెట్టే నైతిక హక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలను నెరవేర్చాలంటూ నిరంకుశ మోడీ ప్రజావ్యతరేక విధానాలను వ్యతరేకిస్తూ ''మోడీ గో బ్యాక్'' అనే నినాదంతో హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్ నుంచి శనివారం ఆ పార్టీ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నాయకులు నల్ల చొక్కాలు ధరించి, నల్ల జెండాలతో ప్రదర్శనగా బయల్లేరారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, సీపీఐ నాయకులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ తోపులాటలో సీపీఐ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ ఛాయాదేవి కింద పడిపోవడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. కె నారాయణ, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటి నరసింహతోపాటు పలువురు సీపీఐ, ఏఐవైఎఫ్ నాయకులూ, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ పోలీసులు సీపీఐ రాష్ట్ర కార్యాలయం లోపలికి వచ్చి కార్యకర్తలు వేసుకుంటున్న నల్ల చొక్కాలను లాక్కోవడం, బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. రాష్ట్ర పోలీసులు ప్రధాని మోడీ కోసం పనిచేస్తున్నారా లేక సీఎం కేసీఆర్ కోసం పనిచేస్తున్నారా? అని ప్రశ్నించారు. నిరంకుశంగా వ్యవహరిస్తూ, రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తూ, రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ, ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నందునే ప్రధాని మోడీ రాకను అడ్డుకుంటున్నామని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రాజెక్టుల మంజూరులో, నిధుల కేటాయింపులో, పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో వివక్ష చూపుతున్నదని అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం వంటి అనేక ప్రాజెక్టులు ఏమయ్యాయని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గు గనులను ప్రయివేట్ పరం చేస్తే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను తీవ్రంగా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ అనైతిక చర్యలను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్ర విమర్శించారు. అంబానీ, అదానీలకు ప్రభుత్వరంగ సంస్థలను ధారాదత్తం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి బి స్టాలిన్, కార్యవర్గసభ్యులు షంషుద్దీన్, ఏఐవైఎఫ్ నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాలకృష్ణ, నిర్లేకంటి శ్రీకాంత్, సీపీఐ నాయకులూ శక్రి భారు, అమీనా, సురేందర్ సింగ్, నదీమ్, వెంకట్ స్వామి, జె కుమార్ తదితరులు పాల్గొన్నారు.