Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల దిగ్బంధనంలో ఆర్టీసీక్రాస్‌రోడ్
- అనుమానం వస్తే గుచ్చిగుచ్చి ప్రశ్నించిన పోలీసులు
- ముందస్తుగానే అదుపులో ముఖ్యనేతలు
- కార్మిక సంఘాల నేతల నిరసనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లో కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు తలపెట్టిన 'మోడీ గో బ్యాక్' నిరసన కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఆర్టీసీక్రాస్‌రోడ్డు పరిసరాల్లో ఎటుచూసినా పోలీసులమయంగా కనిపించింది. అక్కడకు వచ్చిన కార్మిక సంఘాల నేతలను వచ్చినోళ్లను వచ్చినట్టుగానే పోలీసోళ్లు అరెస్టు చేశారు. పరిసర ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్లేవారి విషయంలో కొంచెం అనుమానం వచ్చినా గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. చెప్పినా వినకుండా పోలీసుస్టేషన్లకు పట్టుకెళ్లారు. పలువురు ముఖ్యనేతలు ఇండ్లు దాటకుండా చూశారు. సుదర్శన్ థియేటర్ నుంచి ఆర్టీసీ క్రాస్రోడ్డువైపు బయలుదేరిన ఏఐటీయూసీ, సీఐటీయూ నేతలను తాళ్లతో చక్రబంధనం వేసి అడ్డుకున్నారు. నాయకులు రోడ్డుపైనే కూర్చోవడానికి యత్నించగా కాళ్లు, చేతులు పట్టుకుని మరీ ఎత్తుకెళ్లి వ్యాన్లలోకి బలవంతంగా ఎక్కించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం సమీపం నుంచి ర్యాలీగా క్రాస్‌రోడ్డుకు వెళ్లేందుకు ప్రయత్నించిన టీఆర్ఎస్కేవీ నేతలను అక్కడే అడ్డుకుని అరెస్టు చేశారు. పలు పోలీసుస్టేషన్లకు తరలించారు. వారిని సాయంత్రం ఐదున్నర తర్వాత సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. అరెస్టయిన వారిలో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షులు జి. రాంబాబు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు భూపాల్, ఎం. వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. కోటంరాజు, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు బండారు రవికుమార్, తెలంగాణ మెడికల్ అండ్ సేల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజుభట్, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. వాణి, కుమారస్వామి, తదితరులున్నారు. అరెస్టయిన వారిని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ పరామర్శించారు. ముషీరాబాద్ పీఎస్ ఎదుట టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబుయాదవ్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్, తదితరులు మీడియాతో మాట్లాడుతూ..దేశ సంపదను కార్పొరేట్లకు మోడీ అప్పనంగా కట్టబెడుతున్నదని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు సంస్థలకు అమ్మేయడం దారుణమన్నారు. దేశభవిష్యత్‌కు ఇది తీవ్ర నష్టం చేకూరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్ల పేరుతో కార్మికుల హక్కులను మోడీ సర్కారు కాలరాస్తున్నదని విమర్శించారు. శాంతియుతంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని తాము ప్రయత్నిస్తే అరెస్టు చేయడం అన్యాయమన్నారు. రామగుండం, గోదావరిఖని, సింగరేణి సంస్థ విస్తరించియున్న జిల్లాలతోపాటు తదితర ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్న నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేశారన్నారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులను ప్రజా, కార్మిక సంఘాల నేతలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు.