Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీ కార్మికుల గోస
- మల్టీపర్పస్ పేరిట పలు రకాల పనులు
- సర్పంచులు,కార్యదర్శుల నుంచి బెదిరింపులు
- ఉద్యోగ భద్రత కరువైన వైనం
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
పంచాయతీ కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. పంచాయతీల నుంచి నెలల తరబడి వేతనాలు లేక ఆర్థికంగా చితికిపోతున్నారు. మల్టీపర్పస్ విధానం పేరుతో వారితో అనేక రకాల పనులు చేయించుకుంటున్నా.. అందుకు తగిన వేతనం ఇవ్వడం లేదు. ఇచ్చే కొద్దిపాటి జీతం కూడా నెల నెలా సక్రమంగా ఇవ్వకుండా వేధి స్తున్నారు. పైగా సర్పంచులు, కార్యదర్శుల నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి.
నిజామాబాద్ జిల్లాలో కొన్ని పంచాయతీల్లో ఏకంగా ఐదు నెలల నుంచి వేతనాలు చెల్లిం చడం లేదు. పైగా మల్టీపర్పస్ కార్మికులకు రాష్ట్ర సర్కారు నిర్ణయించిన వేతనం మాత్రం చెల్లించడం లేదు. నెలకు రూ.8500 వేల వేతనం చెల్లించాలని ఆదేశాలున్నప్పటికీ.. మెజార్టీ గ్రామపంచాయతీల్లో అమలు కావడం లేదు. ఒక వేతనాన్ని ఇద్దరికి పంచుతున్నారు. ఈ విషయమై పంచాయతీ అధికారులను అడగ్గా.. ట్రెజరీల్లో నిలిచిపోయాయని, త్వరలో చెల్లిస్తామని చెబుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 530 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో వాటర్మెన్స్, స్వీపర్లు, కారోబార్లు అందరూ కలిపి సుమారు 3500 మంది వరకు పని చేస్తున్నారు. మెజార్టీ పంచాయతీల్లో జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన వేతనాలు అందలేదు. మేజర్ గ్రామ పంచాయతీల్లో రెండు నెలలుగా వేతనాలు అందలేదు.కొన్ని పంచాయతీల్లో మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. వేతనాలు సకాలంలో రాక కార్మికులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇల్లు గడుపుకోవడం కూడా కష్టంగా మారిందని కార్మికులు వాపోతున్నారు. పైగా మల్టీపర్పస్ పేరిట ఒక్కో కార్మికుడితో మూడు నుంచి నాలుగు రకాల పనులు చేయిస్తున్నారు. కారోబార్లు సైతం డ్రైవర్లుగా మారారు. కొన్ని సమయాల్లో మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వడం నుంచి పిచ్చిమొక్కల ఏరివేత వరకు అన్ని పనుల్లో భాగస్వామ్యం చేస్తున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా కార్మికులకు రూ.8,500 వేతనం దక్కడం లేదు. పైగా ఈ ఒక్క వేతనాన్ని ఇద్దరికి పంచుతున్నారు. ఏదో ఒక సాకుతో వేతనంలో కోత విధిస్తున్నారు. కార్మికుల బంధువులు చనిపోయినా, ఏదైనా అత్యవసర పనిపై సెలవు పెట్టినా వేతనంలో కోత విధిస్తున్నారు. ఒక్క రోజు సెలవులో ఉంటే వేతనంలో రూ.650 కోత పెడుతున్నారు. మారుమూల పంచాయతీల్లో ఇద్దరు కార్మికులతో పని చేయిస్తూ వేతనం మాత్రం రూ.4000 చెల్లిస్తున్నారు. మరోవైపు కార్మికులకు అవసరమైన సబ్బులు, నూనెలు, దుస్తులు ఏ పంచాయతీలోనూ ఇవ్వడం లేదు.
ఉద్యోగ భద్రత కరువు..
కార్మికులకు ఉద్యోగ భద్రత కరువైంది. రాష్ట్ర సర్కారు వేతనం రూ.8500 పెంచడంతో చాలా పంచాయతీల్లో దశాబ్దాలుగా పని చేస్తున్న కార్మికులను తొలగించి తమకు నచ్చినవారిని విధుల్లో చేర్చుకున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులను అకారణంగా తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. సర్పంచ్, కార్యదర్శుల నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఏం మాట్లాడినా విధుల నుంచి తొలగిస్తామని అంటున్నారని కార్మికులు వాపోతున్నారు. పంచాయతీ కార్మికులు రిటైర్మెంట్ అయితే ఒక్క రూపాయి కూడా ఆర్థికసాయం దక్కడం లేదు. కార్మికుల వారసులుగా ఆ ఉద్యోగం కల్పించడం లేదు.
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
పంచాయతీ కార్మికులకు వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలి. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులను కలిశాం. వేతనాలు రాక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. మరోవైపు కార్మికులకు సర్పంచులు, కార్యదర్శుల నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఇది సరికాదు.
- నుర్జహాన్- సీఐటీయూ జిల్లా కార్యదర్శి
ట్రెజరీల్లో ఆగిపోయాయి
పంచాయతీ కార్మికులకు రెండు నెలలుగా వేతనాలు నిలిచిపోయాయి. ఆ రెండు నెలలకు సంబంధించిన వేతనాల చెక్కులను సిద్ధం చేసి ట్రెజరీకి పంపాం. ఇప్పటికే రాష్ట్ర కార్యాలయం నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. బహుశా పది రోజుల్లో వేతనాలు చెల్లించే అవకాశముంది. అన్ని పంచాయతీల్లో పూర్తిస్థాయి వేతనం చెల్లిస్తున్నాం. వేతనాల కోతకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులూ రాలేదు.
- జయసుధ- జిల్లా పంచాయతీ అధికారి
పంచాయతీల్లో కేటగిరి వారీగా పనులు అప్పగించాలి
మల్టీపర్పస్ పేరిట ఒక్కో కార్మికుడికి మూడు నుంచి నాలుగు రకాల పనులు అప్పగిస్తున్నారు. పంచాయతీల్లో కేటగిరీల వారీగా మాత్రమే పని చేయించాలి. కారోబార్లు, వాటర్మెన్లు, స్వీపర్లు ఎవరి పని వారికే అప్పగించాలి. అదనపు పని భారం మోపొద్దు. మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి.
- జంగం గంగాధర్- తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి
మూడు నెలలుగా వేతనాలు లేవు
మూడు నెలలుగా వేతనాలు రావట్లేదు. ఇల్లు గడవడం కష్టంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి వేతనాలు చెల్లించాలని కోరుతున్నాం.
- లక్ష్మి, పంచాయతీ కార్మికురాలు