Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అబ్దుల్లాపూర్ మెట్లో అధికారుల వీరంగం
- జేసీబీలతో గుడిసెల కూల్చివేత
- అడ్డుకోబోయిన బాధితులపై దాడి.. ఈడ్చివేత
- నిరసిస్తూ పోలీస్‌స్టేషన్ ముట్టడి : యాచారం పోలీసుస్టేషన్‌కు సీపీఐ(ఎం) నేతల తరలింపు
- ఎర్రజెండా పక్షాన పేదలకు ఇండ్ల జాగాలు పంచుతాం : జాన్‌వెస్లీ
నవతెలంగాణ- అబ్దుల్లాపూర్‌మెట్/ యాచారం
ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలు రెవెన్యూ అధికారులు పోలీసుల వెంటబెట్టుకెళ్లి జేసీబీలతో కూల్చేశారు. అడ్డుకోబోయిన పేదలను ఈడ్చిపడేశారు. వారిపై దాడి చేశారు. దీన్ని నిరసిస్తూ పేదలు స్థానిక పోలీసుస్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేశారు. వారికి అండగా వెళ్లిన సీపీఐ(ఎం) నేతలను కూడా అరెస్టు చేసి యాచారం పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీన్ని ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామ రెవెన్యూ సర్వే నెం.283, సర్వే నెం.573లోని ప్రభుత్వ భూమిలో చాలా రోజుల కిందట పేదలు గుడిసెలు వేసుకున్నారు. తమకు ఇంటి జాగా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, వేసుకున్న గుడిసెలను రెవెన్యూ అధికారులు ఆదివారం ఉదయం కూల్చేశారు. అడ్డుకోబోయిన బాధితులపై దాడి చేయడంతోపాటు ఈడ్చిపడేశారు. దీన్ని నిరసిస్తూ జాతీయ రహదారి 65పై బాధితులు ఆందోళనకు దిగారు. అనంతరం పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. వారికి సీపీఐ(ఎం) నాయకులు సామేల్, జగదీష్ తదితరులు మద్దతుగా నిలిచారు. గుడిసెల ప్రాంతంలో అరెస్టు చేసిన సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, నాయకులు పగడాల యాదయ్య, దుబ్బాక రామచందర్, మండల కార్యదర్శి ఈ.నరసింహా, గోరెంకల నర్సింహతోపాటు మరికొందరిని యాచారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇంటి జాగా ఇచ్చేవరకు గుడిసె పోరాటం ఆగదు
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ
ప్రతి పేదవాడికీ ఇంటి జాగా ఇచ్చేవరకు గుడిసె పోరాటం ఆగదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ, నాయకులు అన్నారు. గుడిసెల ప్రాంతంలో, యాచారం పోలీసుస్టేషన్లో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి పేదల గుడిసెల పోరాటాన్ని అణచివేయాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారందరికీ తలదాచుకోవడానికి ఇంటి జాగా లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, ప్రభుత్వం దర్జాగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడ ఎర్రజెండా పక్షాన నిరుపేదలకు ఇండ్ల జాగాలు పంచుతామని హెచ్చరించారు. ఒక కుటుంబంలో నలుగురు ఐదు అన్నదమ్ములు ఉండి తలదాచుకోవడానికి ఇంటి జాగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అలాంటి పేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటే పోలీసులతో అక్రమ అరెస్టులు చేస్తుందన్నారు. పోలీసుల బెదిరింపులకు భయపడేది లేదని, పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూకబ్జాదారులు కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటే పట్టించుకోని రెవెన్యూ అధికారులు పేదల ఇండ్లను కూల్చివేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అమ్ముకుంటుంటే అధికారుల కండ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలపై దాడులు చేయమని చెప్పారా అని ప్రశ్నించారు. ప్రాణం పోయినా సరే తమ భూమిలు దక్కేవరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడ అర్హులైన నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.దీనిపై తహసీల్దార్ అనితారెడ్డి స్పందిస్తూ.. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని నిర్మాణాలు, గుడిసెలు చేపట్టడంతో కూల్చివేశామని తెలిపారు.