Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణిలో నాలుగు బ్లాకులు ప్రయివేటుకు : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి ప్రయివేటీకరణకు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదనీ, అసలు ప్రయివేటీకరణ ఆలోచనే తమకు లేదని ప్రధాని నరేంద్రమోడీ పచ్చి అబద్ధాలు వల్లించాడని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ విమర్శించారు. మోడీ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. ఆదివారం ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. తప్పుడు ప్రకటనల ద్వారా కార్మికవర్గాన్ని, ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సింగరేణి బొగ్గు బ్లాకులను ఎవరికి కేటాయించాలనే అధికారం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉందని తెలిపారు. మోడీ ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెట్టి అసత్యాలు చెబుతూ తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నదని విమర్శించారు. మరోపక్క బొగ్గు శాఖ కేంద్ర మంత్రి బొగ్గుగనులను వేలం వేస్తున్నట్టుగా ప్రకటించడం వాస్తవాలను తెలియజేస్తుందని తెలిపారు. దాదాపు 450 మిలియన్ టన్నుల బొగ్గునిల్వలున్న కళ్యాణి గని బ్లాక్ 6, సత్తుపల్లి బ్లాక్ -3, శ్రావనపల్లి, కోయగూడెం బ్లాక్ -3 బ్లాకులను సింగరేణి సంస్థే 59కోట్ల రూపాయాలను ఖర్చు చేసి సర్వే నిర్వహించిందని గుర్తుచేశారు. ఆ బ్లాకులను తమకు కేటాయించాలని సింగరేణి సంస్థ అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అయినా ఆ సంస్థకు ఇవ్వలేదని తెలిపారు. ఆ నాలుగు బ్లాకులను వేలం పాట ద్వారా ప్రయివేటు కంపెనీలకు కేంద్రం అప్పజెప్పుతున్నదని విమర్శించారు. సింగరేణి మన అవసరాలైన విద్యుత్, ఎరువుల ఉత్పత్తికి తదితర వాటికోసం చౌకగా బొగ్గు అందిస్తున్నదని తెలిపారు. సింగరేణి బొగ్గును కాకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని పలు సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వమే సింగరేణి ప్రయివేటీకరణకు కేంద్ర ప్రభుత్వమే కారణమని పేర్కొంటూ కార్మిక సంఘాలు మోడీ పర్యటనను వ్యతిరేకించి నిరసన తెలిపాయని పేర్కొన్నారు. దాన్ని తట్టుకోలేకనే మోడీ అబద్దపు ప్రచారానికి ఒడిగట్టారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు, కార్మిక వర్గం ఐక్య ఉద్యమాలు నిర్వహించి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.