Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వచ్చాక 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశాం
- త్వరలో కరీంనగర్లో బస్తీ దవాఖానాలు : ఐఎంఏ రాష్ట్ర సదస్సులో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-కరీంనగర్
వైద్యులు వృత్తి ధర్మాన్ని పాటించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలంగాణ రాష్ట్ర 6వ సదుస్సును ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వీ కన్వెన్షన్ హాల్ నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యులు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్.బి.ఎన్.రావు, కార్యవర్గం ప్రమాణాస్వీకారం చేసింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్‌కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్.సంజరుకుమార్, ఐఎంఏ జాతీయ అధ్యక్షులు సహజనంద ప్రసాద్సింగ్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 17ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసిందన్నారు. రానున్న రెండేండ్లలో 33 జిల్లాల్లో జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్యకరమైన సేవలు అందిస్తామన్నారు. హైదరాబాద్‌లో బస్తీ దవాఖానలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. బస్తీ దవాఖానలతో ఉస్మానియా, గాంధీలో ఓపీ రోగుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. త్వరలో కరీంనగర్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో సూపర్ స్పెషాలటీ వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొచ్చి కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్య సేవలు అందిస్తామన్నారు. ఎన్ఎంసీ నిబంధనల పేరుతో ఇటీవల మంచిర్యాల మెడికల్ కళాశాలను రద్దు చేశారని తెలిపారు. కానీ ఎలాంటి కనీస సౌకర్యాలు లేని ఏఎంసీకి పీజీ అడ్మీషన్లకు అనుమతినివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి పల్లెదవాఖానలు తీసుకొస్తున్నట్టు తెలిపారు.
ఈ సదస్సుకు రాష్ట్ర నలమూలల నుంచి వైద్యులు అధిక సంఖ్యలో హాజరయ్యరు. వైద్య రంగంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా సేవలు అందించడం, రోగులతో వైద్యులు ఎలా ప్రవర్తించాలి, వైద్యులపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవడం వంటి అంశాలతోపాటు సూపర్ స్పెషాలటీ వైద్య సేవలపై ఆయా విభాగాల నిపుణులు చర్చించారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై.సునీల్‌రావు, ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ శరత్కుమర్ అగర్వాల్, డాక్టర్ ఎం.సంపత్‌రావు, డాక్టర్ డి.లవకుమార్, డాక్టర్ బి.నరేందర్‌రెడ్డి, డాక్టర్ గట్టు శ్రీనివాస్‌లు, డాక్టర్ పి.రాంకిరణ్, డాక్టర్ బి.జాన్సీ, డాక్టర్ వెంకట్‌రెడ్డి, కోశాధికారి డాక్టర్ ప్రవీణకుమార్ మన్న, డాక్టర్ అలీం, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ రజనీప్రియదర్శిని, డాక్టర్ ఝాన్సీ, డాక్టర్ వసంత్‌రావు, అరుణ్ కరారి, డాక్టర్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.