Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సాక్షిగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎంపీ కవిత మధ్య విభేదాలు మరోమారు భగ్గుమన్నాయి. కలెక్టర్ కార్యాలయం, మెడికల్ కాలేజీ, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం ప్రారంభానికి సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో మంత్రులు దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లతోపాటు ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. వీరిద్దరి మధ్య కొన్నేండ్లుగా ఆధిపత్య సాగుతున్న పోరు మరోసారి బయటపడింది. టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం పనులను పరిశీలిస్తున్న క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పరస్పరం విమర్శలు గుప్పించుకోవడంతో అసలేం జరుగుతుందో అర్ధం కాలేదు. ఈ క్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జోక్యం చేసుకొని ఇద్దరిని సర్ధుబాటు చేశారు. గతంలోనూ వీరిద్దరి మధ్య బహిరంగంగానే విభేదాలు బయటపడ్డ సందర్భాలూ లేకపోలేదు. ఈ వివాదం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయంతోపాటు, మెడికల్ కాలేజీ, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లతోపాటు జడ్పీ చైర్పర్సన్ బిందు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం పనులు పరిశీలిస్తున్న క్రమంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఈ పనులన్నీ సొంత డబ్బులతో పూర్తి చేయించినట్టు మంత్రి దయాకర్‌రావుకు వివరించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ కవిత జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణానికి పార్టీ నిధులను సమకూర్చిందని ఎమ్మెల్యే వాదనను తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ఈ పనులు చేసిన గుత్తేదారు కేఎల్ రెడ్డి పార్టీ ఇచ్చిన నిధులతోనే భవన నిర్మాణం చేపట్టామని చెప్పారు. దాంతో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో మంత్రి దయాకర్‌రావు ఇద్దరిని శాంతింపచేశారు. కాగా, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాలోత్ కవిత మహబూబాబాద్ ఎమ్మెల్యేగా ఒక పర్యాయం గెలుపొందారు. అనంతరం ఆమె టీఆర్ఎస్లో చేరారు. గత ఎన్నికల్లోనూ మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. పార్టీ నాయకత్వం కవితకు ఎంపీ టికెట్ ఇచ్చి జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా నియమించారు. అయినా వీరిరువురి మధ్య విభేధాలు కొనసాగుతూనే ఉన్నాయి. వచ్చే శాసనసభ ఎన్నికల్లోనూ మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్‌ను కవిత ఆశిస్తుండటంతో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఎంపీ పట్ల అప్రమత్తంగా ఉంటున్నారు. గతంలో పార్టీ కార్యక్రమంలోనూ వీరిద్దరి మధ్య కార్యకర్తల సమక్షంలోనే వాగ్వివాదం జరిగింది. సీఎం పర్యటన ముందస్తు ఏర్పాట్లలో మళ్లీ వీరిద్దరి మధ్య విభేధాలు బహిర్గతం కావడంతో మంత్రులు ఈ విషయంపై దృష్టిసారించే అవకాశం లేకపోలేదు.