Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాళీజాగాలోనే ఇండ్లు కట్టుకునేందుకు అవకాశమివ్వాలి
- ప్రభుత్వమే రూ.5లక్షలు ఆర్థిక సహాయం చేయాలి
- అక్రమ అరెస్టులను మానుకోవాలి : సీపీఐ(ఎం) డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇండ్లు లేని పేదలు ప్రభుత్వ జాగాలో గుడిసెలేసుకుంటే వాటిని అన్యాయంగా కూల్చారనీ, గుడిసెవాసులను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడమేంటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ సర్వే నెంబర్ 283 ప్రభుత్వ భూమిలో 2007లో 573 మంది ఇండ్లు లేని పేదలకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లేఔట్ చేసి పట్టాలు సిద్ధం చేసిందని పేర్కొన్నారు. అయినా వాటిని పంపిణీ చేయలేదని తెలిపారు. ఇండ్ల జాగాలు ఇవ్వాలని పలుసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో సీసీఐ(ఎం) ఆధ్వర్యంలో 600 గుడిసెలేసుకుని అక్కడే 37 రోజులుగా నివసిస్తున్నారని తెలిపారు. వాటిని ఆదివారం ఉదయం రెవెన్యూ అధికారులు, 250 మంది పోలీసులతో వచ్చి తొలగించారని పేర్కొన్నారు. లాఠీ చార్జి చేసి పేదలను భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు. మహిళలు, పిల్లలు తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలను అక్రమంగా అరెస్టులు చేసి వారిని భయబ్రాంతులకు గురిచేయటమేంటని ప్రశ్నించారు. సంబంధిత సర్వే నంబర్లో 300 ఎకరాల భూమి ఉండగా, 10 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు 150 బిల్డింగులు అక్రమంగా నిర్మిస్తున్నారని తెలిపారు. పట్టాలిచ్చిన పేదలకు మాత్రం నేటికీ ఇంటి స్థలం హద్దులు చూపించలేదని పేర్కొన్నారు. పేదలకు అండగా నిలిచిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ, పార్టీ జిల్లా కార్యదర్శి కె భాస్కర్, మండల కార్యదర్శి ఈ నరసింహ, జిల్లా నాయకులు దుబ్బాక రామచందర్, పగడాల యాదయ్యతో పాటు 14 మందిని పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. రెండు రోజుల క్రితమే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. ఇప్పటికైనా పేదలపై దాడులు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. నాటి ప్రభుత్వాలు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినందున ఇండ్లు కట్టుకోవడానికి కుటుంబానికి ఐదు లక్షలు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. వారి పోరాటానికి సీపీఐ(ఎం) అండగా ఉంటుందని తెలిపారు.