Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్వీకే వెబినార్‌లో ఆకెళ్ల రాఘవేంద్ర
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రశ్న ఉన్నచోట సైన్స్ ఉంటుందని ఐఏఎస్ గురుకులం వ్యవస్థాపకులు ఆకెళ్ల రాఘవేంద్ర అన్నారు. సైన్స్ అంటే ఫిజిక్స్, జువాలజీ, బయాలజీ, కెమిస్ట్రీకి సంబంధించింది మాత్రమే కాదనీ, సాంఘీకంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎక్కడ ప్రశ్న ఉంటే అక్కడ సైన్స్ ఉన్నట్టేనని స్పష్టం చేశారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ అధ్యక్షతన 'శాస్త్ర విజ్ఞానం-నెహ్రూ' అంశంపై వెబినార్ జరిగింది. దీనికి ఐఏఎస్ గురుకులం వ్యవస్థాపకులు ఆకెళ్ల రాఘవేంద్ర ప్రధాన వక్తగా మాట్లాడారు. ప్రశ్న, ప్రయోగాల నుంచే శాస్త్ర సాంకేతికత వృద్ధి చెందుతుందని చెప్పారు. నెహ్రూ హయాంలో పంచవర్ష ప్రణాళికల ద్వారా రంగాల వారీగా ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో అభివృద్ధి జరిగిందన్నారు. దీనిలో సైన్స్కూ ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. విద్యార్థులు హరప్ప సంస్కృతి నుంచి ఇప్పటి శాస్త్రసాంకేతికత వరకు అధ్యయనం చేయాలని చెప్పారు. కళాదుడు అనే వ్యక్తి భారతదేశంలో తొలిసారిగా శాస్త్రీయ దృక్పధాన్ని అందించారని వివరించారు. 1980ల తర్వాత దేశంలోకి ఇంటర్నెట్ వచ్చిందనీ, ఆ తర్వాత అనేక సాంకేతిక మార్పులు జరిగాయని చెప్పారు. శాస్త్రీయదాహం, నేర్చుకోవాలనే ఉత్సాహం ఉంటేనే సైన్స్ నిరూపితమవుతుందన్నారు. విద్యార్థులు సైన్స్ పుస్తకాల్లోని అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలనీ, కేవలం మార్కుల కోసమో, టీచర్లు చెప్పారనో చదివితే ఉపయోగం శూన్యమనీ, స్వీయ ఆలోచనలకు పదును పెట్టాలని స్పష్టం చేశారు. ప్రశ్నించడం అలవర్చుకుంటే సమాధానాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస పెరుగుతుందని చెప్పారు. సరోగసీ వంటి అద్భుత శాస్త్రసాంకేతికతకు చేరుకున్నామనీ, అది ఎలా సాధ్యమయ్యిందనే విశ్లేషణ ముఖ్యమనీ అన్నారు. సైన్స్‌పై నెహ్రూకు ఉన్నంత దార్శనికత మరెవరికీ లేదని అభిప్రాయపడ్డారు. ఆ దృష్టి కోణమే ఆయన్ని దేశానికి ప్రధానమంత్రిని చేసిందని చెప్పారు. వ్యవసాయంలో పరిశోధనలు చేయోచ్చని ఆయన గుర్తించారనీ, అదే పద్ధతిని పారిశ్రామికరంగానికీ వర్తింపచేశారని తెలిపారు. సైన్స్ అంటే ప్రశ్నించడం, తెలుసుకోవడం, సిద్ధాంతంవైపుకు నడిపించడమన్నారు. కానీ ఇప్పటికీ ఆదిభౌతికత, కంటితో చూడలేనివాటిని ప్రశ్నించలేకపోతున్నామని చెప్పారు. మానవ శరీరంలోనే అనేక మిస్టరీలు ఉన్నాయనీ, వాటిని ఛేదించే ప్రయత్నమే సైన్స్ అని అన్నారు.