Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా రాష్ట్రాలు తమంతట తాము నూతన పెన్షన్ విధానం నుంచి స్వచ్ఛందంగా బయటకు రావచ్చని సమాచారం హక్కు ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధాన మిచ్చిందని పీఆర్ టీయూటీఎస్ గుర్తు చేసింది. ఈ మేరకు పీఆర్టీయూటీఎస్ అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దాచుకున్న డబ్బు తిరిగి ఇవ్వడం కుదరదని కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్ వ్యాఖ్యలు చేయడం సరికాదని ఖండించారు. పీఎప్ఆర్డీఏ చట్టంలో నూతన పెన్షన్ విధానంలో చేరే విధానాన్ని మాత్రమే పొందుపరిచి, అందులో నుంచి తిరిగి పాత పెన్షన్‌కు ఏ విధంగా మార్చాలో చట్టంలో చేర్చకపోవడం ఉద్యోగులను, రాష్ట్ర ప్రభుత్వాలను మోసం చేయడమే అవుతుందని విమర్శించారు. అలాంటి నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలనీ, లేదా సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టంలో లేనప్పుడు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించే అధికారం రాష్ట్రాలకే ఉందని రాతపూర్వక సమాధానాలు ఎందుకిచ్చారని వారు ప్రశ్నించారు.