Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కవ్వంపల్లి సహా పలువురు అరెస్ట్
- తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
- దాడిని ఖండించిన వినోద్‌కుమార్, టీఆర్‌ఎస్‌జిల్లా అధ్యక్షుడు జివి.రామకృష్ణ
నవతెలంగాణ - గన్నేరువరం/ తిమ్మాపూర్
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వాయ్‌పై పలు యువజన సంఘాల నాయకులు దాడికి పాల్పడ్డారు. కరీంనగర్ జిల్లా గుండ్లపల్లె నుంచి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ.. గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు డా.కవ్వంపల్లి సత్యనారాయణ మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బెజ్జంకి పర్యటనకు వెళ్తుండగా, కాన్వాయ్‌ను గమనించిన యువజన సంఘాల నాయకులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. రసమయి బాలకిషన్ కారుపై పిడి గుద్దులు గుద్దుతూ, ఎమ్మెల్యే రాజీనామా చేయాలని నినదిస్తూ కారును వెంబడించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా, పోలీసులు లాఠీచార్జి చేశారు. అనంతరం యువజన సంఘ నాయకులతో పాటు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎల్ఎండీ స్టేషన్‌కు తరలించారు.
కావాలనే దాడులను ప్రేరేపిస్తున్నారు :బోయినిపల్లి వినోద్‌కుమార్
ఎమ్మెల్యే రసమయిపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్ ఖండించారు. రసమయి ఉద్యమకాలం నుంచి పార్టీలో పనిచేస్తున్నాడని, ఆనాటి నుంచే ఇలాంటి దాడులను ఎన్నో ఎదుర్కొన్నామని అన్నారు. కొందరు కావాలనే దాడులను ప్రేరేపిస్తున్నారని చెప్పారు. పార్టీ కార్యకర్తలు ప్రతిదాడులకు దిగొద్దని, సంయయనం పాటించాలని సూచించారు.
దాడిని ఖండిస్తున్నాం.. : జివి.రామకృష్ణ
కవ్వంపల్లిని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా నియమించింది పార్టీని అభికృద్ధి చేసేందుకా..? యువకులను గుండాలుగా మార్చేందుకా అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జివి.రామకృష్ణ ప్రశ్నించారు. రసమయిపై దాడి అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో చూసుకుందామా అంటూ సవాల్ విసిరారు. కవ్వంపల్లి ఓ పొలిటికల్ బ్రోకర్ అని, నియోజకవర్గంలో రసమయికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి జిల్లాపై ఎలాంటి ప్రేమ లేదని విమర్శించారు. కుల, మతాల పిచ్చి తప్ప అభివృద్ధిపై ధ్యాస లేదని ఆరోపించారు.