Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా బలోపేతం చేసేలా వ్యూహాం
- దానికోసం రేపు టీఆర్ఎస్ విస్తృత సమావేశం
- క్షేత్రస్థాయి నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని దేశవ్యాప్తంగా బలోపేతం ఎలా చేయాలనే దానిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పక్కా ప్రణాళికలు సిద్ధంచేశారు. దాన్ని ఆచరణలోకి తెచ్చేందుకు, క్షేత్రస్థాయి నాయకత్వానికి దిశానిర్దేశం చేయడం కోసం ఈనెల 15న టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మున్సిపల్ చైర్మెన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సహా పార్టీలోని పలు కీలక హౌదాల్లో ఉన్న నాయకులందరినీ ఈ సమావేశానికి హాజరు కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మునుగోడు ఉప ఎన్నిక పూర్తికాగానే ఆయన బీఆర్ఎస్ విస్తృతిపై సుదీర్ఘ కసరత్తు చేశారు. దానికోసం ఎమ్మెల్యేల కొనుగోళ్లు అంశాన్ని ప్రధాన అజెండాగా తీసుకొని దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేసే ప్రయత్నం చేశారు. అందుకే ఎన్నిక పూర్తికాగానే 'ఆధారాలు' అంటూ హడావిడి చేశారు. వాటిని దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టుల న్యాయమూర్తులకు పంపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని స్వయంగా కలిసి, ఆ ఆధారాలను అందచేయాలని నిర్ణయించినట్టు సమాచారం. దానికోసం చీఫ్ జస్టిస్ అపాయింట్మెంట్ కూడా అడిగినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ చర్యల్ని ఎండగట్టడం, బీఆర్ఎస్ తరఫున ఆయా రాష్ట్రాలకు ఇన్చార్జిలను నియమించడం వంటి పలు కీలక నిర్ణయాలు ఆయన తీసుకోనున్నారు. ఈ అంశాలన్నింటినీ క్షేత్రస్థాయి నాయకత్వానికి చెప్పి, వారి సలహాలు, సూచనలు కూడా స్వీకరించి, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా కదనరంగంలోకి దూకాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. మునుగోడు ఉప ఎన్నికపై కూడా ఈ సందర్భంగా సమీక్షించనున్నారు. ఆ అనుభవాలు, భవిష్యత్లో సరిచేసుకోవాల్సిన అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకోనున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పట్ల ఎలాంటి వైఖరి అవలంబించాలనే దానిపై కూడా విశ్లేషించనున్నారు. ప్రజల్లోకి పార్టీని మరింత విస్తృతంగా తీసుకెళ్లడం, దేశవ్యాప్తంగా బీజేపీ వైఫల్యాలను ఎండగట్టడం వంటి రెండు పనుల్ని ఏకకాలంలో చేపట్టడమే లక్ష్యంగా చేసుకొని మంగళవారం పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు.