Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత విద్యా హక్కు సంస్థ చైర్మెన్ జగ్మోహన్సింగ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఫాసిస్టు, నూతన విద్యావిధానాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని భారత విద్యా హక్కు వేదిక (ఏఐఎఫ్ఆర్టీఈ) చైర్మెన్ జగ్మోహన్సింగ్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని మోంట్‌ఫోర్ట్ సోషల్ ఇనిస్టిట్యూట్‌లో ఈ నెల 11,12,13 తేదీల్లో ఏఐఎఫ్ఆర్టీఈ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. అందులో ఆ సంస్థ చైర్మెన్‌గా జగ్మోహన్ సింగ్, వైస్‌చైర్మెన్‌గా ప్రొఫెసర్ చక్రధర్‌రావు ఎన్నికయ్యారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్మోహన్ సింగ్ మాట్లాడారు. దేశంలో రోజురోజుకీ విద్యావ్యవస్థ నిర్వీర్యం అయిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. చక్రధర్‌రావు మాట్లాడుతూ..నూతన జాతీయ విద్యావిధానాన్ని తెలంగాణలో అమలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక విద్యావిధానాన్ని రూపొందించాలని కోరారు. ఏఐఎఫ్ఆర్టీఈ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ వి.ప్రసాద్ మాట్లాడుతూ..నూతన జాతీయ విద్యావిధానం, ప్రయివేటు వర్సిటీలు, విద్యాసంస్థలతో పేదలు, దళితులు చదువులకు దూరం అవుతున్న పరిస్థితి నెలకొందన్నారు. ఆ వేదిక అధ్యక్షవర్గ సభ్యులు ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ...విద్యావ్యవస్థ దేశంలో నిర్వీర్యం అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలోని ఒక వర్గం పూర్తిగా చదువులకు దూరం అయ్యే ప్రమాదం ముంచుకొస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని నొక్కి చెప్పారు. ఆ వేదిక అధికార ప్రతినిధి ప్రొఫెసర్ మధుప్రసాద్ మాట్లాడుతూ..వామపక్ష, ప్రజాతంత్ర, ప్రతిపక్ష పార్టీలు ముందుకు వచ్చి ప్రజావ్యతిరేక విద్యావిధానాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర పోరాట లక్ష్యాలకు అనుకూలమైన విద్యావిధానాన్ని తీసుకురావాలని కోరారు. వేదిక తెలంగాణ కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. జాతీయ నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలనీ, ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డేను విడుదలచేయాలనీ, 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలనీ, విద్యార్థి, ఉపాధ్యాయ ఉద్యమాలపై దాడులను ఆపాలనీ, నర్మదా జీవనశాలపై దాడులను ఖండిస్తూ తీర్మానాలు చేశామని చెప్పారు.