Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతి, కుంభ కోణాలకు కేరాప్ అడ్రస్ కేంద్ర ప్రభుత్వం
- సింగరేణిని బతికుండగానే చంపుతున్న వైనం :సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజకీయ దురుద్దేశంతోనే తెలుగు రాష్ట్రాల్లో మోడీ పర్యటించారనీ, ఆయన పర్యటనల వల్ల ఇరు రాష్ట్రాలకు ఉపయోగం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ చెప్పారు. ఆ పార్టీ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, ఈ.టి.నర్సింహతో కలిసి ఆదివారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్, ప్రయివేటీకరణ విధానాలతో సింగరేణి సంస్థను బతికి ఉండగానే చంపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. జలగలాగా మోడీ ప్రభుత్వం సింగరేణి సంస్థ రక్తాన్ని పీలుస్తున్నదని విమర్శించారు. అవినీతి కుంభకోణాలకు మోడీ ప్రభుత్వమే నాయకత్వం వహిస్తున్నదని చెప్పారు. అదానీ ఆస్తుల పెరుగుదలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమని చెప్పారు. మునుగోడులో బీజేపీ ఓడిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు నిరాశపడకుండా ఉండేందుకే మోడీ రాష్ట్ర పర్యటన చేపట్టారని చెప్పారు. సింగరేణి సంస్థను కేంద్రం ప్రయివేటు పరం చేయటం కుదరదు కాబట్టే..దాన్ని బతికుండగానేే చంపేందుకు కుట్ర చేస్తున్నదన్నారు. 2015లో గోదావరి పరివాహక ప్రాంతంలోని బొగ్గుబావిని సింగరేణికి ఇవ్వాలనే మైన్స్ మినరల్స్ డెవలప్ రెగ్యులేషన్ చట్టాన్ని 2015లో సవరించి, కమర్షియల్ మైనింగ్‌కు అనుమతినిచ్చారనీ, తద్వారా ఇప్పటికే 240 మైన్లను ప్రయివేటుకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఇప్పటికే 98 మైన్లు ప్రయివేటు వ్యక్తులకు కేటాయించారన్నారు. ఇందులో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా ఇచ్చారని చెప్పారు. సింగరేణి పరిధిలోని బొగ్గు బావులను ప్రయివేటుకు అప్పగించిన తర్వాత సింగరేణి ఉత్పత్తి తగ్గిపోతుందని చెప్పారు. దీంతో ఆ సంస్థ బతికుండగానే చంపటం కాదా? అని ప్రశ్నించారు. ఏపీలో పోలవరం, ప్రత్యేక హౌదా లాంటి హామీలను అమలు చేయలేదని విమర్శించారు. తమ రాజకీయ లక్ష్యంతో అక్కడ పాచికలాడుతున్నదని చెప్పారు.