Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంతాపం ప్రకటించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ
- అంత్యక్రియల్లో పాల్గొన్న పుణ్యవతి, జ్యోతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రముఖ కమ్యూనిస్టు నేత, స్వాతంత్య్ర సమరయోధులు ఉద్దరాజు రామం- మాణిక్యాంబ కుమార్తె ఉద్దరాజు కమల(84) శనివారం రాత్రి హైదరాబాద్‌లో మతి చెందారు. ఆమె మృతికి సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సంతాపం తెలిపింది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. అంబర్‌పేటలో కమల మృతదేహానికి సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.పుణ్యవతి, తెలంగాణ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు టి.జ్యోతి నివాళులు అర్పించారు. అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆమె చిన్న తనంలో తన తలిదండ్రులపై నాటి కాంగ్రెస్ పాలకులు సాగించిన దమనకాండ ఫలితంగా వారితో పాటు అజ్ఞాతవాసం కారణంగా పలు ఇబ్బందులు పడ్డారు. అప్పుడు అబ్బిన అభ్యుదయ, కమ్యూనిస్టు భావజాలంతోనే తుది వరకు జీవించారు. భర్త జీవీఎన్ రాజు కూడా తుదివరకు కమ్యూనిస్టుగానే జీవించారు. రామం-మాణిక్యాంబలకు వద్ధాప్యంలో సేవలు అందించి ఆదర్శంగానూ, రామం గారి భావాలకు వారసురాలిగానూ నిలిచారు. 1975లో అత్యవసర పరిస్థితి విధించినపుడు పుచ్చలపల్లి సుందరయ్య, కొరటాల తదితర సీపీఐ(ఎం) అగ్రనేతలకు గుంటూరులోని రామం ఇల్లు రహస్య కేంద్రంగా ఉండేది. బిడ్డలను వామపక్ష భావజాలంతో పెంచటంతో పాటు ప్రజాసంఘాలలో పని చేసేందుకు ప్రోత్సహించారు. పెద్ద కుమారుడు పద్మనాభం ఎస్ఎఫ్ఐ కార్యకర్తగా, కుమార్తె శారద ఎస్ఎఫ్ఐ, యుటిఎఫ్ కార్యకర్తగా, చిన్న కుమారుడు నాగార్జున టిఐఎఫ్ఆర్ ప్రొఫెసర్‌గానూ, ఫ్రీ సాఫ్ట్వేర్ ఉద్యమ జాతీయ నేతగా, అల్లుడు ఎం.కోటేశ్వరరావు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. కమల మృతదేహానికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.