Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎల్ పద్మ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని 175 మోడల్ స్కూల్ హాస్టల్ సిబ్బంది వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎల్ పద్మ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల 2 నుంచి 3 నెలలు, మరికొన్ని చోట్ల ఐదు నుంచి 8 నెలల జీతాలు ఇవ్వలేదన్నారు. జీతాలివ్వకుంటే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్లోని మార్క్స్భవన్లో మోడల్ స్కూల్ హాస్టల్ ఎంప్లాయీస్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మోడల్ స్కూల్ హాస్టళ్లలో పనిచేసే సిబ్బంది మీద ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాలని కోరారు. వారాంతపు సెలవులు అమలు చేయాలనీ, ఎనిమిది గంటల పని దినాన్ని మాత్రమే కొనసాగించాలని కోరారు. కేజీబీవీ లోని సిబ్బందితో సమానంగా వేతనాలు ఇవ్వాలని, స్కావెంజర్లను, హాస్టల్ కు ఒక స్వీపర్ను నియమించాలని డిమాండ్ చేశారు. మెడికల్ సౌకర్యాన్ని కల్పించాలనీ, ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో, అనుబంధ హాస్టల్లో సమస్యల పరిష్కారానికి పూనుకోవాలన్నారు. కార్యక్రమంలో మంజుల, లత, అరుణ, ఉమా, సునీత, లలిత, విజయ తదితరులు పాల్గొన్నారు.