Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామిక, లౌకిక శక్తులు ఏకం కావాలి : ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వక్తలు
నవతెలంగాణ-ముషీరాబాద్
దేశంలో ప్రమాదకర రోజులు రాబోతున్నాయని ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాతా మధుసూధన్, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎమర్జెన్సీ రోజులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నగరంలో పనిచేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు ప్రజల్లో తిరోగమన భావాలను పెంచి పోషిస్తున్నాయన్నారు. ప్రజల్లో ఆశాస్త్రీయ భావాలను ప్రచారం చేస్తూ అవే నిజమైనవని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి భావజాల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రజాస్వామిక, లౌకికశక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్రజాతంత్ర ఉద్యమాల్లో ఎస్ఎఫ్ఐ చురుకైన పాత్ర పోషిస్తున్నదని కొనియాడారు. విద్యార్థుల సమస్యలపై సమరశీల పోరాటాలు చేస్తున్నదని చెప్పారు. ఎస్ఎఫ్ఐ నేర్పిన శాస్త్రీయ ఆలోచనలతో ముందుకు సాగుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పూర్వ నాయకులు జి. బుచ్చిరెడ్డి, ఎం. శ్రీనివాస్, సోమయ్య, జె.కె. శ్రీనివాస్, జి. రాంబాబు, డివైఎఫ్ఐ సిటీ కార్యదర్శి జావేద్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి అశోక్ రెడ్డి, పూర్వ విద్యార్థులుఅబ్దుల్ ఖదీర్, ప్రొఫెసర్ కృష్ణ, ప్రొఫెసర్ చిన్న బసవయ్య, అనురాధ, కె. సుప్రియ, పి. లక్ష్మీ, ఎంవీ సుభాషిణి, రాధిక, సలీమా తదితరులు మాట్లాడారు.