Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 27,28,29 తేదీల్లో రెండో మహాసభలు
- వాటి జయప్రదం చేయండి : తెలంగాణ రైతుసంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభలు ఈ నెల 27,28,29 తేదీల్లో నల్లగొండలో జరుగుతాయనీ, 27న బహిరంగ సభ ఉంటుందని ఆహ్వాన సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, రైతుసంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్రావు, టి.సాగర్ తెలిపారు. ఆ మహాసభల ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నవంబర్ 27న రైతుల భారీ ప్రదర్శన అనంతరం బహిరంగ సభ జరుగుతుందన్నారు. నవంబర్ 28న మహాసభలు ప్రారంభమవుతాయనీ, సభలకు అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అశోక్ దావలే, హనన్మోల్లా, సహాయ కార్యదర్శి డాక్టర్ విజూ కృష్ణన్ పాల్గొని ప్రసంగిస్తారని తెలి పారు. కౌలు, పాడి, మహిళా, పత్తి, చెరుకు, రైతులు పాల్గొంటారని చెప్పారు. రైతుల ఆదాయం ప్రభుత్వ విధానాల ఫలితంగా తగ్గుతుందని అన్నారు. ఉపకరణాల ధరలు విపరీతంగా పెరుగుతున్న స్థితిలో కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు పెంచకపోవడం వల్ల రైతులు రుణగ్రస్తులు అవుతున్న తీరును వివరించారు. కనీస మద్దతు ధరలను శాస్త్రీయంగా నిర్ణయించకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లను కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికి ఈనామ్ తెచ్చారని విమర్శించారు. మార్కెట్ల నుంచి ప్రభుత్వం వైదొలిగే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఎరువుల సబ్సిడీలు తగ్గించడానికి పీఎం ప్రణామ్ పథకాన్ని తెచ్చిందని విమర్శించారు. విత్తన పరిశోధనలను పూర్తిగా విరమించి ఇతర దేశాల నుంచి బహుళజాతి సంస్థల టెక్నాలజీని దిగుమతి చేసుకుంటున్నా రన్నారు. ఫసల్ బీమా పథకం అమలుకాక పోవడంతో రైతులు ఇబ్బదులకు గురవుతున్నా రన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం వాటిల్లినప్ప టికీ రైతులకు పరిహారం అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి వెబ్సైట్లో తప్పులు ఉండడం వల్ల రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తిచడం లేదన్నారు. అప్పులు, వడ్డీల భారాలు భరించలేక పేద, మధ్య, కౌలు తరగతి రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రయివేటు వ్యాపారుల వల్ల రైతులు వరి, పత్తి, పప్పు ధాన్యాలు, నూనెగింజల అమ్మకంలో ఏటా 5 వేల కోట్ల నష్టపోతున్నారన్నారు. రైతాంగం పడే ఇబ్బందులను రాష్ట్ర మహాసభలలో చర్చించి భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేస్తామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. జంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, బొంత చంద్రారెడ్డి, అరిబండి ప్రసాదరావు, నున్నా నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శులు మాదినేని రమేష్, గొల్లపల్లి జయరాజు, మోకు కనకారెడ్డి, నక్కా యాదవరెడ్డి, మంగ నర్సింహ్మ, కున్రెడ్డి నాగిరెడ్డి, మద్దిరాజు శ్రీనివాస్, మూడ్ శోభన్, డి. బాల్రెడ్డి, లెల్లల బాలకృష్ణ పాల్గొన్నారు.