Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అమీన్పూర్
కాలనీలో నెలకొన్న నీటి సమస్య ముగ్గురి ప్రాణాలను బలిగొంది. మూడ్రోజులుగా కాలనీలో నీటి కొరత ఉండటంతో తల్లీకూతుళ్లు బట్టలు ఉతికేందుకు వెళ్లి కాలుజారి చెరువు లో పడి మృతిచెందారు. కాగా చెల్లి మృతదేహం లభ్యం కాకపోవడంతో.. గాలింపు కోసం వెళ్లిన సోదరుడు సైతం నీటిలో గల్లంతై మరణించారు ఈ ఘోర విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. సీఐ శ్రీనివాసులు రెడ్డి, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్పూర్ మండలం నర్రెగూడెం జేఎన్ఎన్ యూఆర్ఎం ఇండ్లలో జమ్మయ్య, యాదమ్మ(38) దంపతులు వారి ఇద్దరు కూతుళ్లు లావణ్య(14), నందినితో కలిసి నివసిస్తున్నారు. అయితే మూడ్రోజులుగా కాలనీలో నీటి సరఫరా లేకపోవడంతో.. బట్టలు ఉతికేందుకు తన చిన్న కూతురు లావణ్యతో కలిసి దగ్గరలోని ఐలాపూర్ ఈర్ల చెరువు వద్దకు శనివారం మధ్యాహ్నం యాదమ్మ వెళ్లింది. బట్టలు ఉతికిన అనంతరం చెరువు దాటే క్రమంలో తల్లీ కూతురు కాలు జారీ నీటిలో పడి మృతి చెందారు. అయితే ఆదివారం ఉదయం లావణ్య మృతదేహం లభ్యమైంది. యాదమ్మ మృతదేహం లభ్యం కాకపోవడంతో.. ఆమె సోదరుడు తర్పోలు ఉసిరయ్య నీటిలోకి దిగి గాలించే ప్రయత్నం చేస్తూ.. అతడూ గల్లంత య్యాడు. దాంతో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా.. ఉసిరయ్య మృతదేహం లభ్యమైంది. యాదమ్మ మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జేఎన్ఎన్ యూఆర్ఎం కాలనీలో నీటి సరఫరా లేకపోవడంతోనే ఇంతటి ప్రమాదం జరిగిందని స్థానికులు వాపోతు న్నారు. ఉసిరయ్యకు భార్య రాములమ్మ, ఇద్దరు కూతుళ్లు, కుమారులు ఉన్నారు. యాదమ్మ భర్త జమ్మయ్య ఐలాపూర్ తండాలో వాటర్ లైన్మెన్గా పనిచేస్తున్నారు. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు ఉదయం నుంచి దగ్గరుండి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.