Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్ టౌన్
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు ఆధ్వర్యంలో బీఎంఎస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింలుతో పాటు మరికొందరు ఆదివారం సీఐటీయూలో చేరారు. జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్ (సీఐటీయూ కార్యాలయం)లో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా ఆయనతో పాటు రామస్వామి, సతీష్‌కుమార్, కుమార్, శ్రీను, సత్యం, చంద్రం సీఐటీయూలో చేరారు. చుక్క రాములు వారికి కండువాలు కప్పి సీఐటీయూలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, కార్మిక చట్టాల మార్పు, ప్రజలపై వేస్తున్న భారాలను చూసి కార్మికులంతా ఆ పార్టీపై విరక్తి చెందారన్నారు. 150 ఏండ్లుగా పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులు, చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి హక్కులను కాలరాస్తూ కార్మికుల పొట్ట కొడుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతరేక విధానాలపై బీఎంఎస్ యూనియన్ ఐక్య పోరాటాలకు కలిసి రావడం లేదన్నారు.
దేశంలో కార్మికుల హక్కుల కోసం నిరంతరం కృషి చేసే ఏకైక యూనియన్ సీఐటీయూ అని తెలిపారు. హక్కుల సాధన కోసం భవిష్యత్తులో కార్మికుల సమస్యలపై కలిసి పని చేద్దామని ఈ సందర్భంగా కోరారు. సీఐటీయూ కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బస్వరాజ్, ఉపాధ్యక్షులు ఏ.మల్లేశం, బాలమణి, కోశాధికారి నర్సమ్మ, సహాయ కార్యదర్శి నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.