Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న రాష్ట్ర సదస్సును జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నరసింహ, కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ తెలిపారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్య వృత్తి రక్షణ, మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.5,000 కోట్లు కేటాయించాలనీ, ప్రతి మత్స్య సొసైటీకి రూ.10 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. 50 ఏండ్లు నిండిన మత్స్యకారులకు వృద్ధాప్య పెన్షన్ ప్రతి నెల రూ.5,000 ఇవ్వాలనీ, రెండో విడతగా ఎన్సీడీసీ ద్వారా 34 రకాల సంక్షేమ పథకాలు అందించాలని రాష్ట్ర సదస్సులో తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు చనమోని శంకర్, రాష్ట్ర కార్యదర్శి అరవపల్లి శ్రీరాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు కనకతార తదితరులు పాల్గొన్నారు.