Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు సీజన్ల వడ్ల కమీషన్ ఇవ్వని ప్రభుత్వం
- అంతకుముందూ 60 శాతం డబ్బులు ఇవ్వలే
- నిజామాబాద్ జిల్లాకు రూ.40 కోట్ల వరకు పెండింగ్
- వేతనాలూ చెల్లించలేని స్థితిలో చైర్మెన్లు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అప్పుల్లో కూరుకుపోయాయి. సర్కారు నుంచి రావాల్సిన ధాన్యం కమీషన్ విడుదలవ్వక.. ప్రస్తుతం కనీసం వేతనాలు చెల్లించలేని స్థితిలో ఉన్నాయి. చాలా సొసైటీల్లో కనీస వసతులు కరువయ్యాయి. గోదాముల్లో సొసైటీలు ఏర్పాటు చేసే స్థితికి చేరాయి. నిజామాబాద్ జిల్లాలోని సొసైటీలకు సర్కారు నుంచి ఏకంగా రూ.40 కోట్లు రావాల్సి ఉంది. గత రెండు సీజన్ల నుంచి పైసా ఇవ్వలేదు. అంతకుముందు రెండు సీజన్ల నుంచి 30 శాతం చొప్పున 60 శాతం కమీషన్ ఆగిపోయింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా... అప్పుల్లో ఉన్న సొసైటీలపై మరింత ఆర్థిక భారమవుతోంది. దాంతో చాలా సొసైటీలు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు సర్దుబాటు కింద ఎరువుల డబ్బులు వినియోగిస్తున్నాయి. దీనివల్ల డీలర్లు ఆయా సొసైటీలు పెండింగ్ డబ్బులు చెల్లిస్తేనే కొత్తగా ఎరువులు పంపిణీ చేస్తామని మెలిక పెట్టాయి. దాంతో చైర్మెన్లు తలలు పట్టుకుంటున్నారు.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 89 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. ఈ సొసైటీల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్, యాసంగి ధాన్యం కొనుగోలు చేయిస్తోంది. అలాగే సొసైటీల ద్వారా ఎరువుల విక్రయాలు కొనసాగిస్తోంది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి క్వింటాకు రూ.32 చొప్పున కమీషన్ చెల్లిస్తోంది. 2021-22 రబీ సీజన్లో ఈ సొసైటీల ద్వారా 84,980 మంది రైతుల నుంచి 57,62,646 క్వింటాల్లో ధాన్యం కొనుగోలు చేశారు. 2,447 మెట్రిక్ టన్నుల విత్తనాలు, 80,782 మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీ చేశారు. సొసైటీల ద్వారా పెద్దఎత్తున సేవలు అందజేస్తున్నా ఆ మేర రాష్ట్ర ప్రభుత్వం నుంచి సొసైటీలకు ఎలాంటి ఆర్థికసాయమూ అందడం లేదు. సొసైటీలు అందించే సేవల ద్వారా కమీషన్ తీసుకునే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అన్ని సొసైటీలు ధాన్యం కమీషన్‌పై ఆధారపడి నడుస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కమీషన్ డబ్బులు రావడం లేదు. గత రెండు సీజన్లకు సంబంధించి కమీషన్ డబ్బులు రాలేదు. అలాగే అంతకుముందు ఒక్కో సీజన్‌కు సంబంధించి 30 శాతం చొప్పున రెండు సీజన్ల 60 శాతం కమీషన్ పెండింగ్ ఉంది. నిజామాబాద్‌లోని 89 సొసైటీలకు మొత్తం రూ.40 కోట్లు పెండింగ్ ఉంది. నందిపేట్ మండలంలోని ఒక్క చింరాజ్పల్లికి సంబంధించి రూ.కోటి వరకు కమీషన్ పెండింగ్ ఉంది. సొసైటీల్లో నిధుల కిటకిట ఉండటంతో హమాలీల డబ్బులు రైతులే చెల్లిస్తున్నారు. క్వింటాకు రూ.15 చొప్పున రైతులు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో ఆర్థిక అవసరాలకు సొసైటీలు అత్యవసర సమయాల్లో సర్దుబాటు కింద ఎరువుల డబ్బులు వినియోగిస్తున్నాయి. కానీ డీలర్లు మాత్రం సొసైటీల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఒక సీజన్లో కొంత మేర కూడా నిధులు పెండింగ్ ఉంటే మరో సీజన్‌కు ఎరువులు, విత్తనాలు సరఫరా ఆపేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రయివేటు కంపెనీలు తమ ప్రతినిధిని ఆయా సొసైటీలకు కేటాయించి ఎరువులు, విత్తనాలు అమ్మి ఆ డబ్బును నేరుగా కంపెనీలకు తీసుకెళ్తున్నాయి. నిజామాబాద్‌లోని సొసైటీలు మార్క్‌ఫెడ్‌కు రూ.15 కోట్ల మేర పెండింగ్ ఉన్నాయి. ఒకవేళ సర్కారు ధాన్యం కమీషన్ విడుదల చేస్తే రూపాయి బకాయిలు లేకుండా సొసైటీలు లాభాల్లోకి వచ్చే అవకాశముంది. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పేందుకు చైర్మెన్లు బయపడుతున్నారు. అధికార పార్టీలో ఉండటంతో ఆర్థికభారమైనా బయటకు చెప్పలేని పరిస్థితి నెలకొంది.
సంవత్సరం పూర్తవగానే విడుదల
సొసైటీలకు ధాన్యం కమీషన్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమే. కానీ ఆ నిధులు ప్రతి సంవత్సరం పూర్తవగానే విడుదల అవుతాయి. రెండు సీజన్లకు కలిపి ఒకేసారి విడుదల చేస్తారు. ఈ సంవత్సరం త్వరలో విడుదల అవుతాయని భావిస్తున్నాం.
- సింహాచలం, జిల్లా సహకార అధికారి