Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గూడు లేక అద్దె ఇంట్లో ఉంటున్నాం
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట గుడిసెవాసుల ధర్నా
- సర్కారు భూములు ప్రజా అవసరాలకా.. కబ్జాదారులకా..?
- కలెక్టర్, రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పాలి : సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె. భాస్కర్
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
'భూమిపై జీవించే మూగ జీవాలు, పక్షులకు సైతం ఉండటానికి తమకంటూ ఓ గూడు ఉంటుంది. ఈ భూమి మీద మనుషులుగా పుట్టిన మాకు మాత్రం తలదాచుకోవడానికి గూడు ఉండకూడదా? మా రెక్కలు ముక్కలు చేసుకుని, చెమట ధారపోసి ప్రభుత్వానికి పన్నులు కడుతూ దేశ సంపదలో భాగమవుతున్నాం. అయినా మమ్మల్ని ఈ సర్కారోళ్లు పట్టించుకున్న పాపానపోలేదు. కానీ వేల కోట్ల విలువ చేసే భూములు పెద్దపెద్దోళ్లకు అప్పనంగా ముట్టజేపుతుండ్రు.. మేం ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటే పోలీసులు మాపై దాడులు చేస్తూ గుడిసెలు కూల్చుతున్నరు.. మాకు ఈ భూములపై హక్కు లేదా..? దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. అప్పటివరకూ మా పోరాటం ఆపేది లేదు. ఎన్ని దినాలైనా ఇక్కడే ఉంటాం' అని కందుకూరు, అబ్దూల్లాపూర్మేట్ గుడిసెవాసులు స్పష్టం చేశారు. తమ గుడిసెలను కూల్చడాన్ని నిరసిస్తూ.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఇంటి జాగా ఇవ్వాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కె. భాస్కర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు ప్రజా అవసరాల కోసమా.. బడా నాయకులు, రియల్ వ్యాపారుల అక్రమణదారులకు కట్టబెట్టేందుకా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంటి నిర్మాణం కోసం గుడిసెలు వేసుకున్న పేదలపై దాడులు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు గుడిసెలు వేసుకున్న ప్రభుత్వ భూమిని వారు కబ్జా వేయడం అయితే, వేల ఎకరాల ప్రభుత్వ భూములను బడాబాబులు కబ్జా చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను బడా వ్యాపారులకు కట్టబెట్టి, కాసులు దండుకునేందుకు ప్రజాప్రతినిధులు, రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తుందన్నారు. జిల్లాలో ఎంత భూమి అక్రమణకు గురైందో లిస్టుతో సహా ఇస్తామని, ఆ భూములను కాపాడే దమ్ము జిల్లా యంత్రాంగానికి ఉందా అని ప్రశ్నించారు. వీరిని వదిలి కందుకూరు, అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతాల్లో ప్రజలు గుడిసెలు వేసుకుంటే ప్రభుత్వం పోలీసు బలగాలతో వారిపై దాడి చేసి గుడిసెలను కూల్చడం సిగ్గు చేటన్నారు.
ప్రభుత్వం నిరుపేద దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి, ఇవ్వకపోగా సామాన్యులపై దాడులు చేయడం బాధాకరన్నారు. తక్షణమే పేదలకు ఇంటి జాగాల పంపిణీపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావుకు బాధితులతో కలిసి వినతిపత్రం అందజేశారు. దీనికి సానుకులంగా స్పందించిన అదనపు కలెక్టర్ తమ సమస్యలు త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్టు భాస్కర్ తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పగడాల యాదయ్య, జిల్లా కమిటీ సభ్యులు దుబ్బాక రాంచందర్, జగన్, నర్సింహ, శ్రీనివాస్, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.