Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీ కార్మికులకు 2017, 2021 వేతన ఒప్పందాలను అమలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీఏ, 2013 సవరించిన పే-స్కేలు బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు సోమవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న రూ.1,500 కోట్ల కార్మికుల భవిష్య నిధిని ఆర్టీసీ పీఎఫ్ ట్రస్టుకు చెల్లించాలని తెలిపారు. కార్మికుల నుంచి రికవరీ చేసిన రూ.800 కోట్లను సీసీఎస్‌కు చెల్లించాలంటూ గతంలో ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేశామని గుర్తు చేశారు. ఈ సమస్యలను పరిష్కరిస్తామంటూ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకూ అవి పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉండటం కార్మికులను, కార్మిక నాయకులను ఆందోళనకు గురిచేస్తున్నదని తెలిపారు.
వాటితోపాటు ఆర్టీసీ కార్మికోద్యమంపై నిషేధం తొలగించాలని జూలకంటి డిమాండ్ చేశారు. కార్మికులపై యాజమాన్యం వేధింపుల్లేకుండా యూని యన్ నాయకులతో స్నేహపూర్వక వాతావరణంలో ఆర్టీసీని ప్రగతి పథంలో నడిపించే అవకాశాలను మెరుగుపర్చాలని సూచించారు. బడ్జెట్లో రెండు శాతం నిధులు కేటాయించాలనీ, రాయితీ బకాయిలు చెల్లించాలని కోరారు. ఆర్టీసీని ప్రజారవాణాగా అభివృద్ధి చేసేందుకు బస్సుల సంఖ్యను పెంచాలం టూ ప్రతిపక్షాలు, సంఘాలు ప్రభుత్వాన్ని కోరు తున్నాయని గుర్తు చేశారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కూడా ఆర్టీసీ కార్మికుల సమస్య లపై సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇప్పటికైనా వారి ఆర్థికపరమైన సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.