Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు సీఎస్ ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆరాంఘర్ చౌరస్తా శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో రోడ్డు, అభివృద్ధి, విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఆరాంఘర్-శంషాబాద్ రోడ్డు విస్తరణ పనుల పురోగతిపై సోమవారం బీఆర్కేఆర్ భవన్లో ఆర్అండ్బీ, ట్రాన్స్‌కో, రెవెన్యూ, ఎండోమెంట్స్, వక్ఫ్‌బోర్డు తదితర శాఖల అధికారులతో సోమేశ్‌కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ. 283 కోట్ల వ్యయంతో 10 కిలోమీటర్ల మేర ఆరులైన్ల రోడ్డు విస్తరణ, రెండు సర్వీస్ రోడ్లు, ఈరోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని చెప్పారు. వీటితోపాటు, వ్యవసాయ విశ్వవిద్యాలయం, సాతంరాయి, ఎయిర్పోర్ట్ ప్రవేశ మార్గాల వద్ద అండర్ పాస్‌లు, గగన్ పహాడ్ వద్ద ఫ్లైఓవర్, శంషాబాద్ టౌన్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఈ రోడ్డు విస్తరణ పనుల వల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలనీ, అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్న విషయాలపై ప్రజాప్రతినిధులతో సమావేశం వెంటనే నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ డిసెంబర్ నెలలోగా పనులను పూర్తి చేసేందుకు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి పోలీసుశాఖ సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఈ పనుల పురోగతిపై తాను స్వయంగా ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రోడ్డు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ కార్యదర్శి అనీల్ కుమార్, హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమరుకుమార్, వక్ఫ్ బోర్డు కార్యనిర్వహణ అధికారి షాన్వాజ్ ఖాసీమ్, విద్యుత్ శాఖ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు, కేంద్ర ప్రభుత్వ రహదారుల శాఖ ప్రాంతీయ అధికారి ఖుషావా, ట్రాన్స్‌కో డైరెక్టర్ జగత్‌రెడ్డి, జాతీయ రహదారుల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధర్మారెడ్డి, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ, శంషాబాద్ ఏసీపీ భాస్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు.