Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశ్రమ ఎదుట మృతుని భార్య పిల్లలతో ఆందోళన
- స్పందించని యాజమాన్యం
నవతెలంగాణ/తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)
ఉద్యోగానికి వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో సొంత గ్రామంలోని కోనేరులో శవమై కనిపించాడు. పరిశ్రమకు చెందినవారే తన భర్తను హత్య చేసి కోనేరులో పడేసి మూడురోజులైనా తనకు చెప్పకుండా గోప్యంగా ఉంచారని, దీనిపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలంటూ పరిశ్రమ ఎదుట కార్మికుని భార్య, తన పిల్లలు, అత్తమామలతో కలిసి ఆందోళన చేపట్టింది. ఈ ఘటన సోమవారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌లో జరిగింది. మృతుని భార్య నవ్య తెలిపిన వివరాల ప్రకారం... సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మంగలి మల్లేష్(32) మనోహరాబాద్ మండలం కాళ్లకల్ శివారులోని యూకిస్ సీడ్స్ ప్రయివేటు లిమిటెడ్ పరిశ్రమలో ప్లాంట్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. మల్లేష్‌కు భార్య నవ్య, కూతురు మనస్విని(3), కుమారుడు మోక్షిత్ (5 నెలలు) ఉన్నారు. ప్రతి రోజు మాదిరిగానే ఈ నెల 9న ఉదయం కాళ్లకల్ శివారులో ఉన్న సీడ్ పరిశ్రమకు వెళ్లాడు. సాయంత్రం భార్య నవ్య ఫోన్ చేయడంతో ఆలస్యమవుతుందని చెప్పాడు. 10వ తేదీన ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ రావడంతో అనుమానం వచ్చి మల్లేష్ కుటుంబ సభ్యులు పరిశ్రమ వద్దకు వెళ్లారు. మల్లేష్‌కు చెందిన ద్విచక్రవాహనం, ఫోన్ పరిశ్రమలోనే ఉన్నాయి. మల్లేష్ పరిశ్రమలో లేకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. శుక్రవారం మధ్యాహ్నం బండ తిమ్మాపూర్ గ్రామ శివారులోని కోనేరు వద్ద మల్లేష్ చెప్పులు కనిపించాయి. దాంతో అనుమానంతో వెతకడంతో మల్లేష్ కోనేరులో శవమై కనిపించాడు. మృతుని భార్య, ఇద్దరు పిల్లలు కుటుంబీకులతో కలిసి తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం పరిశ్రమ ఎదుట ఆందోళనకు దిగారు.