Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణకు రూ.700 కోట్లు వ్యయం చేస్తూ ప్రణాళికలు రూపొందించినట్టు కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. సోమవారంనాడాయన ఈ రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, కన్స్ట్రక్షన్ సీఏఓ నీరజ్ అగర్వాల్, డివిజినల్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా, తదితరులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆధునిక సౌకర్యాలు, మెరుగైన నిర్మాణ డిజైన్‌తో రాష్ట్రంలోనే ఉత్తమ రైల్వే స్టేషన్‌గా మారుతుందని చెప్పారు. రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా, మూడు దశల్లో ఈ ప్రాజెక్టును చేపడుతున్నామన్నారు. మొదటి దశ పనులు 16 నెలల్లో, రెండో దశ 28 నెలల్లో, మూడో దశ 36 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. కొత్తస్టేషన్ భవనంలో 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా ట్రావెలేటర్ల సదుపాయాలు వుంటాయని తెలిపారు.
ఇవీ ఈ ప్రాజెక్ట్ విశేషాలు
- జీ ప్లస్ 3 అంతస్తులతో ఉత్తరం, దక్షిణం వైపు కొత్త స్టేషన్ భవనాలు నిర్మిస్తారు.
- రెండు అంతస్తుల స్కై కన్కోర్స్ ఏర్పాటు
- స్టేషన్‌కు ఉత్తరం వైపు మల్టీ-లెవల్ పార్కింగ్, దక్షిణం వైపు భూగర్భ పార్కింగ్ కేంద్రాలు నిర్మిస్తారు.
- ట్రావెలేటర్లతో పాటు ఉత్తర, దక్షిణ భవనాల వద్ద 7.5 మీటర్లతో రెండు నడక మార్గాల నిర్మాణం చేపడతారు.
- తూర్పు, పడమర మెట్రో స్టేషన్లను స్కైవేతో అనుసంధానం చేస్తూ ఉత్తరం వైపు నడక మార్గం ఏర్పాటు
- కొత్త స్టేషన్‌కు అనుగుణంగా ప్రయాణికుల అవసరాలకు సరిపోయేలా ప్లాట్‌ఫారమ్‌ల పునరుద్ధరణ.
- ప్రయాణీకుల రాకపోకలు, వాహనాల కదలికలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్ బ్లాక్‌లు ఏర్పాటు చేస్తారు.
- 5వేల కిలోవాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయాలని ప్రణాళికల్లో పేర్కొన్నారు.