Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మరో ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 15న (మంగళవారం) నూతన కాలేజీలను సీఎం కేసీఆర్ ఆన్లైన్ పద్ధతిలో ప్రారంభిస్తారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. వెంటనే తరగతులు కూడా ప్రారంభమవుతాయని ఆయన ట్వీట్ చేశారు. వీటి ప్రారంభంతో రామగుండం, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, సంగారెడ్డి, వనపర్తి, జగిత్యాల, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. 2014 నుంచి 2022 వరకు చూస్తే రాష్ట్రంలో మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు 124 శాతం పెరిగాయి. జాతీయ స్థాయిలో ఇది కేవలం 72 శాతంగా ఉంది. అంటే జాతీయ సగటు కంటే 1.3 రెట్లు రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నది. పీజీ సీట్ల పెంపుదలలోనూ రాష్ట్రంలో 117 శాతముండగా, జాతీయ స్థాయిలో 93 శాతానికే పరిమితమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 18 లక్షల మంది వైద్యవిద్య అభ్యసించేందుకు దరఖాస్తు చేసుకుంటుంటే 91,000 సీట్లు (ఐదు శాతం మాత్రమే) ఉండగా, రాష్ట్రంలో 61,000 దరఖాస్తులకుగాను 6,615 సీట్లు (11 శాతం) ఉండటం గమనార్హం. అంటే సీట్ల లభ్యతలో దేశ సగటు కంటే రెట్టింపు ఉన్నాయి. ఇక గ్రామీణ జిల్లాల్లో వైద్యకళాశాలల విషయంలో దేశంలో 27 శాతముండగా, రాష్ట్రంలో 54 శాతముండటం విశేషం. ఇప్పటికీ వైద్యవిద్యను అభ్యసించాలని కోరుకునే వారి సంఖ్య అధికంగా ఉండటం, సీట్లు తక్కువగా ఉండటంతో ప్రతి ఏడాది విదేశాలకు వెళ్లే వారి సంఖ్య 20 వేల నుంచి 25 వేల వరకున్నట్టు అంచనా.