Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ పులుల సంరక్షణ అథారిటీ బృందం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (ఎన్టీసీఏ) బృందం రాష్ట్రంలో వారం రోజుల పాటు పర్యటించింది. అమ్రాబాద్, కవ్వాల్ పులుల అభయారణ్యంలను క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. దేశవ్యాప్తంగా ఉన్న టైగర్ రిజర్వుల పనితీరు, నిర్వహణపై ప్రతీ నాలుగేండ్లకు ఒకసారి జాతీయ అథారిటీ మూల్యాంకన బృందంతో మదింపు చేయిస్తున్నది. దీనిలో భాగంగా రాష్ట్రంలో ఉన్న రెండు టైగర్ రిజర్వుల్లో ఈ బృందం పర్యటించి, అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలను పరిశీలించింది. సోమవారం అరణ్య భవన్లో పీసీసీఎఫ్, హెచ్ఓఓఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్తో జాతీయ పులుల సంరక్షణ అథారిటీ బృందం సభ్యులు ధీరేంద్ర సుమన్, నితిన్ కకోద్కర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ల నిర్వహణ జాతీయ స్థాయి ప్రమాణాలతో అద్భుతంగా ఉందని ప్రశంసించారు. పులులు, ఇతర వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ రక్షణ చర్యలు, గడ్డి క్షేత్రాల పెంపు, నీటి వసతి నిర్వహణ బాగుందని తెలిపారు. తెలంగాణ అటవీ శాఖ ప్రయత్నాలు, ఇతర కారిడార్ నుంచి వచ్చే పులులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయని బృందం సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇటీవల పెరిగిన పులుల కదలికలను అందుకు ఉదాహరణగా చెప్పారు. మహారాష్ట్రలో ఉన్న తడోబా, తిప్పేశ్వర్ అభయారణ్యంలలో పులుల జనాభా పెరిగి, ఒత్తిడి ఉందనీ, అవి కవ్వాల్కు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు అనువైన వాతావరణం ప్రస్తుతం ఉందని అన్నారు. అటవీ అవాసాల పునరుద్దరణలో భాగంగా కోర్ ఏరియాలో ఉన్న గ్రామాల తరలింపు శుభసూచకమనీ, మిగతా గ్రామాల తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే కారిడార్లో ఉన్న మిగతా ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాల్లో తునికాకు సేకరణను నియంత్రించాలని ఈ బృందం సూచించింది. రెండు రిజర్వుల్లోనూ సిబ్బంది, యువ అధికారులు బాగా పనిచేస్తున్నారని, ఇదే తరహా ఉత్సాహాన్ని కొనసాగించాలని సూచించారు. పులుల సంరక్షణ కోసం ప్రత్యేక టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు, మరిన్ని బేస్ క్యాంపుల ఏర్పాటును పరిశీలించాలని చేసిన ప్రతిపాదనకు పీసీసీఎఫ్ వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని తెలిపారు. పులుల అభయారణ్యంల సమర్థ నిర్వహణ కోసం మరింతగా కంపా నిధుల వినియోగానికి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా పీసీసీఎఫ్ అభ్యర్థించారు. ఈ విషయాన్ని కేంద్ర పరిశీలనకు తీసుకువెళ్తామని ఆ బృందం హామీ ఇచ్చింది. ఈ సమావేశంలో పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, కవ్వాల్, అమ్రాబాద్ ఫీల్డ్ డైరెక్టర్లు వినోద్ కుమార్, క్షితిజ, అటవీ శాఖ ఓఎస్డీ (వైల్డ్ లైఫ్) శంకరన్, తదితరులు పాల్గొన్నారు.