Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలను తప్పుదోవ పట్టించటం తగదు :మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రధాన మంత్రి స్థాయిలో మోడీ అబద్దాలు చెప్పి ప్రజలను పక్కదారి పట్టించడం తగదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎం ఎస్ ప్రభాకర్, ఎంపీ బి వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ప్రయివేటీకరణ విషయంలో మోడీ సత్యదూరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. సింగరేణి ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఎప్పటి నుంచో ఆందోళనలు చేస్తున్నారని గుర్తుచేశారు. ఆ పోరాటాల ఫలితంగానే ప్రయివేటీకరించబోమంటూ మోడీ చెప్పాల్సి వచ్చిందన్నారు. సింగరేణి అత్యంత పురాతన ప్రభుత్వ రంగ సంస్థ అని చెప్పారు. బొగ్గు వెలికి తీయడంతో ఆ సంస్థకు అనేక సామాజిక భాద్యతలు ఉన్నాయన్నారు. తమ వాటా తక్కువ ఉన్నందుకే ఆ సంస్థను ప్రయివేటీకరణ చేయడం లేదన్నట్టుగా మోడీ మాట్లాడారని గుర్తుచేశారు. పార్లమెంట్లో బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇచ్చిన సమాధానానికి మోడీ ప్రకటనకు వ్యత్యాసం ఉందన్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్నును మినహాయించాలని శాసన సభ తీర్మానం చేసి పంపినా కేంద్రం ఎందుకు స్పందించటం లేదో చెప్పాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయడం అంటే రిజర్వేషన్ల హక్కును హరించడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అణగారిన వర్గాలకు అన్యాయం రుగుతుందన్నారు. ఈ విషయంపై కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రికి ఇప్పటికే లేఖ రాశామని తెలిపారు. భవిష్యత్ లో ఇదే అంశంపై ఉద్యోగుల నుంచి నిరసనలు తప్పదని హెచ్చరించారు. వెంకటేష్ నేత మాట్లాడుతూ రామగుండం కార్యక్రమంలో స్థానిక ఎంపీ నైన నన్ను పిలవకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించారని తెలిపారు. బండి సంజరును కార్యక్రమానికి ఎందుకు పిలిచారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని లోక్ సభ ప్రివిలేజీ కమిటీకి పిర్యాదు చేస్తామన్నారు.