Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
బాలల దినోత్సవం రోజున మధ్యాహ్నం భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం పోకలగూడెం ప్రభుత్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసారు. పాఠశాలలో మొత్తం 147 మంది విద్యార్థులుండగా.. 111మంది మాత్రమే భోజనం చేశారు. వారిలో సుమారు 11మంది విద్యార్థులు దగ్గు, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. గమనించిన ఉపాధ్యాయులు హెచ్ఎం ఝాంకిలాల్కు తెలపడంతో స్థానిక ఏఎన్ఎంతో ప్రథమ చికిత్స అందించారు. అక్కడినుంచి ఆటోలో మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి విద్యార్థులను తరలించారు. అయితే పాఠశాల నుంచి ఇండ్లకు చేరుకున్న మరికొంత మంది విద్యార్థుల్లో నలుగురికి ఇదే పరిస్థితి ఉండటంతో తల్లిదండ్రులు వారినీ ఆస్పత్రికి తరలించారు. దాంతో అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఖ్య 15కు చేరింది. వైద్యాధికారి వెంకట ప్రకాష్ చికిత్స అందించారు. పరిస్థితులను బట్టి జిల్లా ఆస్పత్రికి పంపుతామని తెలిపారు. విషతుల్యమైన ఆహారం కారణమని పరీక్షించనిదే చెప్పలేమని డాక్టర్లు చెప్పారు.