Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మెన్ ఆయాచితం శ్రీధర్
- నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ చిక్కడపల్లి బ్రాంచీలో బాలల పుస్తక ప్రదర్శన
నవతెలంగాణ-ముషీరాబాద్
డిజిటల్ క్లాసులు, గూగుల్ సెర్చ్ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పిల్లల్లో పుస్తక పఠనం నర్సరీ దశ నుంచే అలవాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మెన్ ఆయాచితం శ్రీధర్ చెప్పారు. నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ హైదరాబాద్ చిక్కడపల్లి బ్రాంచీలో సోమవారం బాలల పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తమ చిన్నతనంలో ప్రకాశం పంతులు, సుందరయ్యలాంటి వారు నిరాడంబరంగా జీవించడం చూశామని, తమ ఆస్తి అంతా త్యాగం చేసి ప్రజా సేవ చేశారన్నారు. కానీ నేడు బిల్ గేట్స్ లాంటి వారు ఎలా కోట్లు సంపాదిస్తున్నారో తెలుసుకొని వీరిని గొప్పగా చెప్పే స్థితిలో ఉన్నామని చెప్పారు. పిల్లల్లో దేశభక్తి, స్నేహం, స్వేచ్ఛ, సోదరతత్వం, లౌకిక భావాలు పెంపొందించాలని సూచించారు. పలు పాఠశాలల బాలబాలికలు ఉదయం నుంచే ఈ పుస్తక ప్రదర్శనకు వచ్చి ఆసక్తిగా వివిధ ప్రచురణల పుస్తకాలను తిలకించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ పుస్తక ప్రదర్శనను సద్వినియోగం చేసుకోవాలని, అన్ని రకాలైన పుస్తకాలకు డిస్కౌంట్ పొంది సాహిత్యాభిలాష పెంపొందించుకోవాలని నవతెలంగాణ బుకహేౌస్ ఎడిటర్ కె.ఆనందాచారి తెలియజేశారు. మేనేజర్ కిష్ణారెడ్డి మాట్లాడుతూ.. బాలల దినోత్సవం, గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పిల్లల పుస్తక ప్రదర్శనలో పుస్తకాలపై 20% డిస్కౌంట్ ఇస్తామని, దీనిని పాఠకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు, కవి తంగిరాల చక్రవర్తి, సిబ్బంది ధనలక్ష్మి, సిద్ధు, సుధాకర్, రఘు, రాజు, గోపి తదితరులు పాల్గొన్నారు.