Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రహదారిపై బైటాయించిన సర్పంచ్, రైతులు
- విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
నవతెలంగాణ-పదర
నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని సర్పంచ్ ప్రవీణ్ కుమార్, రైతులు డిమాండ్ చేశారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండల కేంద్రంలోని మద్దిమడుగు రహదారిపై రైతులు, ఆయా పార్టీల నాయకులు బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. పత్తి నకిలీ విత్తనాలు వేసి నష్టపోయిన రైతుల కు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు బాగుంటేనే మనందరం బాగుంటామన్నారు. అలాంటి రైతులకు నష్టం జరిగి రోడ్డుపైకి రావడం బాధాకరమన్నారు. ఇక్కడ ఉన్న సబ్డీలర్ల వల్ల ఈ తప్పిదం జరగలేదని, పెద్ద పెద్ద బడా బాబుల వల్లే జరిగిందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదం వల్ల నకిలీ విత్తనాలు సరఫరా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, రాజకీయ నాయకుల కమీషన్ల కక్కుర్తి వల్ల రైతులు నేడు రోడ్డుపైకి వచ్చారని ఆవేదన వెలిబుచ్చారు. రైతుల కష్టం సొమ్ముతో వ్యాపారులు ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారే తప్ప రైతులు మాత్రం అలాగే ఉన్నారని గుర్తుచేశారు. ఇప్పటికైనా నష్టపోయిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. అనంతరం వ్యవసాయ అధికారి సురేష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చిన్న చంద్రయ్య, సింగిల్ విండో డైరెక్టర్ రమేష్ యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రామలింగయ్య యాదవ్, బీజీపీ నాయకులు రామోజీ, టీఆర్ఎస్ నాయకులు ముత్యాలు, నగేష్, సత్యనారి, అంజి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.